టీడీపీ X జనసేన
● జనసేన చేసే అభివృద్ధికి ‘పచ్చ’ ఆటంకాలు
● టీడీపీ ముఖ్యనేత వైఖరిపై
సేనలో అసంతృప్తి
● బీజేపీని పట్టించుకునే నాథుడు కరువు
● కూటమి ధర్మానికి తూట్లు
● ఏకపక్ష నిర్ణయాలతో
టీడీపీ సమీక్షలు, సమావేశాలు
● సమావేశాలకు జనసేన, బీజెపీ నేతలకు అందని పిలుపు
● నేనే బాస్ అంటూ
అధికారులకు బెదిరింపులు
రాజంపేట: పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ముఖ్యనేత, జనసేన పార్లమెంటరీ స్థాయి ముఖ్యనేత మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జనసేన ముఖ్యనేత తన అధినేత పవన్‌కళ్యాణ్ సిఫారసుతో అభివృద్ధి పనులు తెచ్చుకుంటే వాటిని అడ్డుకునేందుకు టీడీపీ ముఖ్యనేత విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులకు నేనే బాస్ అంటూ అధికారులను ఫోన్‌ల ద్వారా బెదిరిస్తున్నారు. దీంతో అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఒక్క టీడీపీ ముఖ్యనేత మీద నడుస్తోందన్న విమర్శలున్నాయి. అన్ని శాఖల అధికారులు జనసేన, బీజేపీ నేతల విషయంలో ఆచితూచి అడుగువేస్తున్నారు.
అమలు కాని కూటమి ధర్మం
కూటమిలో బీజెపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు భాగస్వాములయినా.. అన్నింటా పెత్తనం చేసేందుకు టీడీపీ ముఖ్యనేత కీలకంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన రెండు పార్టీల నాయకులను పట్టించుకోకపోవడంతో వారు కినుకవహిస్తున్నారు. పాటిస్తున్నారు. దీంతో ముఖ్యనేత వైఖరిపై సేనల్లో అసంతృప్తి జ్వాల రగులుతోంది.
సమావేశాలకు పిలుపేదీ?
కూటమి ప్రభుత్వం రాజంపేటలో టీడీపీ ఏకపక్షంగా వ్యవహారిస్తోంది. అధికారులు కూడా టీడీపీనే అధికారపార్టీగా గుర్తించారు. అందువల్ల జనసేన, బీజెపీ నేతలను పట్టించుకునే పాపన పోవడంలేదు. కూటమి ప్రభుత్వానికి సంబంధించి సమావేశాలు, సమీక్షలకు మూడు పార్టీల నుంచి నేతలను పిలవాల్సింది పోయి, టీడీపీ ముఖ్యనేతనే ఆహ్వానిస్తున్నారు. దీంతో అన్ని సమీక్ష సమావేశాలకు ఆయనే హాజరవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లో జనసేన, బీజేపీ నేతలు కనిపించరు. అయితే టీడీపీ ఒకటే కాదు ప్రభుత్వం అంటే జనసేన, బీజెపీలు కూడా అని అధికారులకు ఆ పార్టీ నేతలు హితబోధ చేస్తున్నారు. అయితే ముఖ్యనేత మాట వినకుంటే బదిలీ చేస్తామని సందేశాలను పంపడంతో అధికారులు ఏమీ చేయలేక తలలు పట్టుకున్నారు.
బీజెపీని పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా నాయకులు ఉన్నా తమ పార్టీకే పరిమితమయ్యారు. తాము కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నామని, కూటమి అధికారంలోకి రావడానికి తమ పార్టీ కీలకమనేది మరిచిపోయారని వారు వాపోతున్నారు. అధికారులు కూటమి అంటే కేవలం టీడీపీ అన్నట్లుగా నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారని కాషాయనేతలు పెదవివిరుస్తున్నారు.


