● కమలాపురంలో
ఇసుక మాఫియా పంజా
● పొడదుర్తి యువకులను
నిర్బంధించి దాడి
సాక్షి టాస్క్ ఫోర్స్ : కమలాపురం నియోజకవర్గంలో ఇసుక మాఫియా విజృంభిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు. గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఎవరైనా వాస్తవ పరిస్థితులు పరిశీలించినా ప్రాణాల మీదకు వస్తోంది. అచ్చం అదే పరిస్థితి పొడదుర్తి గ్రామానికి చెందిన ఇరువురి యువకులకు సోమవారం ఎదురైంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పొడదుర్తి గ్రామానికి చెందిన బాల నరసింహులు, వెంకటేశ్వర్లు అనే యువకులు పక్కనే ఉన్న పాపాగ్ని నదిలోకి వెళ్లారు. అక్రమంగా, ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్న మాఫియా వ్యవహారాన్ని చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు. వీరిని గమనించిన అక్రమార్కులు సోమవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఆ యువకులను నిర్బంధించి ఇష్ట రాజ్యంగా దాడి చేశారు. ఎవరు చెబితే ఇక్కడికి వచ్చారో చెప్పండి అంటూ హింసించినట్లు సమాచారం. అయితే పొద్దు పోయేంతవరకు కూడా వారికోసం ఎవరూ రాకపోవడంతో రాత్రి 9:30 సమయంలో యువకుల్ని వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. పాపాగ్ని నది కేంద్రంగా ఇసుక ఇష్టానురాజ్యంగా తరలిస్తున్న వైనంపై ఇటీవల మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి గళం విప్పారు. అయితే మరింతగా రెచ్చిపోయిన ఇసుక మాఫియా తమకు ఎదురొచ్చే మొనగాళ్లు ఎవరంటూ సవాల్ విసురుతోంది. చిత్తానుసారంగా నదులను లూటీ చేస్తున్నా జిల్లా కలెక్టర్ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అధికార యంత్రాంగం మిన్నకుండిపోవడంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో అడ్డుగా నిలుస్తున్న ఆయా గ్రామస్తులపై ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నారు. అందులో భాగంగానే పొడదుర్తి గ్రామానికి చెందిన బాల నరసింహులు, వెంకటేశ్వర్లు నిర్బంధానికి గురయ్యారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టుకుని వెళ్తుంటే నిశ్చేష్టులై ప్రజలు చూస్తుండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా అక్రమార్కులను కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉన్నతాధికారులపైన ఎంతైనా ఉంది.


