కడప వైఎస్‌ఆర్ సర్కిల్: బెంగళూరులో నిర్వహించిన 4వ చెస్‌ఫ్యూజన్ ఓపెన్ – ఏజ్ గ్రూప్ రాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో జిల్లా క్రీడాకారుల సత్తా చాటారని, నాలుగు బహుమతులు సాధించారని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్ దర్బారీ పేర్కొన్నారు. అండర్–10 బాలికల విభాగంలో కడపకు చెందిన అమీన 7 రౌండ్లలో 5.5 పాయింట్లు సాధించి ప్రథమ స్థానం, అండర్–8 బాలికల విభాగంలో వినమ్రత 7 రౌండ్లలో 4 పాయింట్లు సాధించి నాలుగో స్థానం పొందినట్లు చెప్పారు. ప్రొద్దుటూరుకు చెందిన ధనిత ఏడో స్థానం సాధించిందన్నారు. ఓపెన్ విభాగంలో అంతర్జాతీయ ఫిడే రేటెడ్ క్రీడాకారుడు, చెస్ కోచ్ అయిన అనీస్ దర్బారీ 7 రౌండ్లలో 5 పాయింట్లు సాధించి ఏడో స్థానం సాధించి నగదు బహుమతి పొందారన్నారు. ఓపెన్ విభాగంలో రెహాన్ 4 పాయింట్లు, అండర్–8 బాలుర విభాగంలో దేవ్ ఆర్యన్ 4, గణేష్ 2.5, అండర్–10 బాలుర విభాగంలో నిఖిలేశ్వర్ 4, అండర్–12 బాలుర విభాగంలో భావేష్ 3.5, నవాజ్ 2.5 పాయింట్లు సాధించారని తెలిపారు.
ఉపాధి హామీ పోస్టర్ ఆవిష్కరణ
కడప సెవెన్‌రోడ్స్: ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు జీవనోపాధి భద్రతను పెంచడంతో పాటు ఆర్థిక భద్రతను కల్పిస్తుందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సభాభవన్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదనంగా కూలీలకు రోజుకు కనీస వేతనం రూ.240కి పెంచినట్లు, ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.51 లక్షల కోట్లు కేటాయించగా, ఈ నిధులను గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, నీటి భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి పనులకు వినియోగించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ నిధి మీనా, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, డ్వామా పీడీ అదిశేషారెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మహిళలు, బాలికల
భద్రతకు ప్రాధాన్యత
– ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్: జిల్లా పోలీసుశాఖ మహిళలు, బాలికల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యంలో వారోత్సవాల్లో భాగంగా కడపలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి సెవెన్ రోడ్స్ సర్కిల్ వరకు సోమవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సెవెన్ రోడ్స్ సర్కిల్ వద్ద మానవ హారం నిర్మించి మహిళా భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, బాలికల భద్రతపై గత కొన్ని నెలలుగా కాలేజీలు, పాఠశాలలు, పల్లె నిద్ర కార్యక్రమాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా డయల్ 112 నంబర్‌కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరిస్తారన్నారు. ర్యాలీలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్పీ (ఏ.ఆర్)బి.రమణయ్య, కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ. బాలస్వామి రెడ్డి, ఏఆర్ డీఎస్పీ పి. నాగేశ్వర రావు, మహిళా పీఎస్ సీఐ ఎల్లమరాజు, నగరంలోని వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు.


