పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలకు అధికారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని, రీ ఓపెన్‌కు అవకాశం ఇవ్వరాదని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జేసీ డాక్టర్ నిధి మీనా, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, పర్యాటక శాఖ అధికారి సురేష్ కుమార్, కో–ఆపరేటివ్ శాఖ అధికారి వెంకటసుబ్బయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కొన్ని అర్జీల వివరాలు..
● తాను దివ్యాంగుడినని, తనకు పింఛన్ మంజూరు చేయాలని ఎర్రగుంట్ల మండలం హనుమాన్ గుత్తివాసి జి. గంగాధర్ కోరారు.
● తన కుమార్తె పి.రాఘవి నీట్ పరీక్షకు ఈ నెల 7వ తేదీకి కుల ధృవీకరణ పత్రం అవసరం ఉందని, జారీ చేయవలసిందిగా తొండూరు మండలం బూచుపల్లివాసి పి. శ్రీనివాసులు విన్నవించారు.


