‘రాజంపేట’లో బలహీనంగా ఉన్నాం | - | Sakshi
Sakshi News home page

‘రాజంపేట’లో బలహీనంగా ఉన్నాం

Mar 3 2026 8:10 AM | Updated on Mar 3 2026 8:10 AM

వైఎస్సార్‌సీపీ బలంగా ఉందంటూ టీడీపీ నేతల అంగీకారం

చంద్రబాబు కూడా సంతోషంగా లేరట

ఆ కుటుంబాల బలం

ఐదువేల ఓట్లేనని ఎద్దేవా

వేదికపై ఖాన్‌కు అవమానం

మదనపల్లె: ‘రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మనం బలహీనంగా ఉన్నాం, బలం పుంజుకోవాల్సి ఉంది’ అంటూ టీడీపీ నేతలు బహిరంగ పర్చుకున్నారు. ఈ పరిస్థితిపై చంద్రబాబు సంతోషంగా లేరంటూ బాబు అంతరంగాన్ని బయటపెట్టారు. మదనపల్లె బైపాస్‌రోడ్డులోని ఓ కల్యాణమండపంలో జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఈ సభలో మాట్లాడిన నేతలు పార్టీ పరిస్థితిపై చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోనే వైఎస్సార్‌సీపీ బలం ఎక్కువ

జిల్లా నూతన అధ్యక్షుడు ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోనే రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో వైఎస్సార్సీపీ బలం ఎక్కువగా ఉందని పరోక్షంగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో పార్లమెంటు స్థానం బలంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇక్కడ బాధ్యతల నిర్వహణ అంత సులువు కాదన్న ధోరణి ఆయనలో వ్యక్తమైంది.

చంద్రబాబు సంతోషంగా లేరు

తర్వాత మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి.. చంద్రబాబు సంతోషంగా లేరని ప్రసంగంలో చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పరిస్థితి ఒక ఎత్తు అయితే రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో పార్టీ పరిస్థితి మరోలా ఉందన్నారు. ఇక్కడ పార్టీ బలపడాల్సిన అవసరం ఉందని, పరోక్షంగా వైఎస్‌ఆర్సీపీ బలాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలోనే టీడీపీకి అత్యధిక బలం కలిగిన తంబళ్లపల్లెలో టీడీపీ క్యాడర్‌ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి భయపడుతున్నారని మంత్రి చెప్పడం ఆ పార్టీ వర్గాల్లోనే చర్చకు దారితీసింది. పార్టీ క్యాడర్లో భయం ఉంటే ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో గత టీడీపీ ఇన్చార్జ్‌ జయచంద్రారెడ్డిపై కేసు నమోదు కావడం ఎలా సాధ్యమైందని గుర్తు చేస్తున్నారు. పార్టీ పరువు తీసిన ఈ వ్యవహారంతో ఇబ్బంది పడుతుంటే, అధికారంలో ఉండి కార్యకర్తలు భయంతో ఉన్నారని మంత్రి చెప్పడం పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగించిందని చర్చించుకుంటున్నారు.

ఆ కుటుంబాలు వీరేనా

మంత్రి మండిపల్లి ప్రసంగంలో మరో విషయం చర్చనీయాంశమైంది. ఆయన మాటల్లో టీడీపీలో ఉన్న నేతల కుటుంబాలకు ఐదు వేల ఓట్ల బలం ఉండొచ్చు, మిగతా బలమంతా చంద్రబాబుదని.. ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాజకీయం చేస్తామని చెప్పారు. ఈ మాటలు ఎవరి ఉద్దేశించి చెప్పారోనని చర్చ మొదలైంది. సొంతంగా గెలవగలిగే సత్తా లేదన్న మంత్రి ప్రస్తావన ఎవరిని ఉద్దేశించి చేశారోనని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.

కేసులు ఎత్తివేయాలట

అంగళ్లు, పుంగనూరు ఘటనలపై నమోదైన కేసుల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఉపశమనం కలిగించేలా కేసులు మాఫీ చేయించాలని ఎమ్మెల్యే కిషోర్‌ కుమార్‌ రెడ్డి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు ప్రస్తావించగా, ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ ఇన్‌చార్జ్‌ మంత్రి జనార్దనరెడ్డి హామీ ఇచ్చారు.

ఖాన్‌కు కుర్చీలేదు

జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులై, వేదికపై ప్రమాణ స్వీకారం చేసిన పఠాన్‌ ఖాదర్‌ ఖాన్‌ కు అవమానం జరిగింది. వేదికపై అందరూ కూర్చున్నప్పటికీ ఆయనకు కుర్చీ లేదు. జిల్లా టీడీపీలో రెండో కీలకమైన పదవిలో ఉన్న మైనార్టీ నాయకుడి ని కూర్చోవడానికి సీటు లేకపోవడం చర్చనీయాంశమైంది. తొలిసారిగా మైనార్టీవ్యక్తికి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినా ఇలా వ్యవహరిస్తారా అని పార్టీలోని ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement