మరోసారి విభేదాలు బహిర్గతం
సాక్షి టాస్క్‌ఫోర్స్: పులివెందుల నియోజకవర్గంలో టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, బీటెక్ రవి వర్గాల మధ్య కొంత కాలం నుంచి దూరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం పులివెందులలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించింది. అన్ని శాఖల నుంచి ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అయితే ఇందులో కొసమెరుపు ఏమిటంటే స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డికి ఆహ్వానం అందనట్లు సమాచారం. ఈ సమావేశం కేవలం బీటెక్ రవి కుటుంబ సభ్యుల అధ్యక్షతన జరిగినట్లుగా ఉంది. బీటెక్ రవి, ఆయన తమ్ముడు, చిన్నాన్నలు సమీక్ష చేశారు. దీనిపై అధికారులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అభివృద్ధి సమావేశమా లేక కుటుంబ సమావేశమా అని వారు మథన పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఈ మీటింగ్‌కు హాజరు కాకపోవడంపై తెలుగుదేశం పార్టీలోనే పలువురు నాయకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు అనేక సార్లు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు కూడా రాజ్యాంగ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది.
● బీటెక్ రవి అధ్యక్షతన సమావేశం
● హాజరు కాని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి


