మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాల్సిందే
చింతకొమ్మదిన్నె : అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు రకరకాల హామీలు చెప్పి ఆచరణలో అమలు చేయకుండా చంద్రబాబు స్వార్థ ఆలోచనలతోనే, కుటిల పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మంగళవారం చింతకొమ్మదిన్నె మండల కేంద్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో సంక్షేమ పథకాలు, ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఎగ్గొట్టిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే అన్నారు. రైతులకు మొదటి సంవత్సరం రూ. 20,000 పూర్తిగా ఎగరగొట్టారని, రెండవ సంవత్సరం కూడా అరకొరగానే అందించారని ధ్వజమెత్తారు. ఆరు ఉచిత సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా, ఒకటి రెండు మాత్రమే ఇచ్చారని, తల్లికి వందనం పేరిట దాదాపు 35 లక్షల మందికి ఎగరగొట్టారని, అరకొర హామీలు మాత్రమే అమలు చేస్తూ కేవలం ప్రచారం ద్వారా మాత్రమే కాలం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అమ్ముకొని దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అనతికాలంలోనే విపరీతంగా అప్పులు చేస్తున్నారని, ప్రజలకు హామీలు అమలు చేయకుండా ఆ డబ్బుతో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా 2.15లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారన్నారు. రాష్ట్రంలోని ఆస్తులు వనరులను అమ్మకానికి పెట్టడమే పనిగా చేస్తున్నారన్నారు. గతంలోనూ స్పిన్నింగ్ మిల్లులు, కో–ఆపరేటివ్ సెక్టార్ లోని షుగర్ ఫ్యాక్టరీలు అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుదేనన్నారు. వేలాదిమంది ఉపాధి పొందిన ఆల్విన్ ఫ్యాక్టరీని సైతం అమ్మిన ఘన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. బాబు హయాంలోనే ఆర్టీసీని సైతం అమ్మకం చేపట్టే ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆర్టీసీ ని రాష్ట్ర ప్రభుత్వం లోకి చేర్చారన్నారు. మీడియా సంస్థల ద్వారా చంద్రబాబు అబద్ధాలనే పదే పదే ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 42 టూరిజం హోటళ్లను సైతం అమ్మే కార్యక్రమం చేస్తున్నారని, అమరావతి పేరుతో వందలాది ఎకరాలు దారాధత్తం చేస్తూ, తిరుపతి, గండికోట లాంటి చోట్ల కూడా ప్రైవేట్ వారికి అతి తక్కువ ధరలకే కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. వీరు చేస్తున్న ఆగడాలపై ప్రజలు ప్రశ్నిస్తే కిందిస్థాయి నుండి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు వేధింపులకు గురి చేస్తూ అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులేనని ప్రజలు చూస్తూ ఊరుకుంటే ఇలాగే మెడికల్ కాలేజీలు అమ్మే కార్యక్రమం చేపట్టారని, వైఎస్ జగన్ గట్టిగా నిలదీసి ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే టెండర్లు వేసేవారు కూడా వెనకడుగు వేయడం జరిగిందని, అందువల్లే ప్రస్తుతానికి ఆగి ఉన్నట్లు తెలిపారు. ఒక్కో మెడికల్ కళాశాలకు 50 ఎకరాల నుండి 100 ఎకరాలు ప్రభుత్వ భూములు కేటాయించి లేనిచోట్ల ప్రైవేట్ ఆస్తులు సైతం కొనుగోలు చేసి మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణం చేపట్టే విధంగా వైఎస్ జగన్ చేశారని వివరించారు. అలాంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని చూడడం దుర్మార్గమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజలందరం కలిసి పోరాడుదామని, అందుకే కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు. ప్రతిపక్షాలతో పాటు అధికార కూటమి పార్టీల కార్యకర్తలు సైతం సంతకాలు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారని, ప్రతి గడప తొక్కి సంతకాలు సేకరణ చేపట్టే కార్యక్రమం చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు. మెడికల్ కళాశాలల ప్రైవేటుపరం పూర్తిగా ఆపే వరకు వైఎస్‌ఆర్‌సీపీ విశ్రమించబోదని ప్రజలకు హామీ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలకు పూర్తిగా అండగా నిలిచామని గుర్తుచేశారు. చంద్ర బాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలందరికీ తెలియపరచాలని పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్సిపి మండల కన్వీనర్ గూడా ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు శ్రీరామ్ రెడ్డి, లక్ష్మిరెడ్డి, విశ్వనాథరెడ్డి, కష్ణయ్య, కళా యాదవ్, ఓబుల్ రెడ్డి జయరామిరెడ్డి నాగరాజు, సురేంద్ర,రాజు, వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ తదితర నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి


