ఖర్చు వివరాల్లో ఈ తేడాలేంటి..?
● గత ఏడాది క్లాప్ వెహికల్స్ తిరగలేదు కదా..?
● సర్కులారిటీ అకౌంట్‌పై
ఉద్యోగుల మౌనం
● స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్
పట్టాభిరామ్ అసహనం
మదనపల్లె : ఉన్న వాహన లెన్ని, వాటి నిర్వహణకు అవుతున్న ఖర్చు లెక్కల్లో తేడాపై స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కమిషనర్ ప్రమీలను ప్రశ్నించారు. మంగళవారం మదనపల్లెలో వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటి ఆదాయ, వ్యయాలు, నిర్వహణ అంశాలపై కమిషనర్ వివరిస్తూ ఉండగా వాహనాల అంశంపై ఆయనకిచ్చిన లెక్కలు, ప్రజెంటేషన్ లెక్కలో తేడా ఉండటంతో చైర్మన్ ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో మున్సిపాలిటీలకు చెందిన క్లాప్ వాహనాల వినియోగం ఆగిపోయిందని, ఇక్కడ నిర్వహణ ఎలా సాధ్యమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీన్ని సరిచేసుకుంటామని కమిషనర్ వివరణ ఇచ్చారు. చైర్మన్ ప్రసంగంలో సర్కులారిటీ అకౌంట్ నిర్వహణపై ఎంతమందికి తెలుసని ప్రశ్నించగా అందరూ మౌనంగా ఉండిపోగా ఒక మహిళ ఉద్యోగి మాత్రమే స్పందించి దాని గురించి వివరించారు. దీనిపై అసహనానికి గురైన పట్టాభిరామ్ ఈ అంశంపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని డీఎల్‌పీఓ నాగరాజును ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ద్య నిర్వహణ బాగాలేదని, డంపింగ్‌యార్డుల నిర్వహణ కూడా జరగడం లేదన్నారు. గ్రామీణ స్వచ్ఛసర్వేక్షణ్ సర్వేలో లోపాలను గుర్తించి సరిచేసుకోవాలన్నారు. రాష్ట్రంలో 1,600 ఎలక్ట్రికల్ వాహనాలు, 12వేల ట్రైసైకిళ్లు, 5వేల పుష్ గార్డులను కొనుగోలు చేసి మున్సిపాలిటీలకు అందించనున్నట్టు చెప్పారు. ఇంటిగ్రేటేడ్ వేస్ట్ ప్రాసెసింగ్ నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని కోరారు. దీని ప్రక్రియ కొనసాతుందన్నారు. 25–30 కిలోమీటర్ల పరిధిలో ఒక వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపించి గ్రామాలను అనుసంధానం చేసి అక్కడికి చెత్త తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమీక్షకు ముందుకు మున్సిపాలిటి డంపింగ్‌యార్డును పరిశీలించి అక్కడ చేపట్టిన పనులను పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, మున్సిపల్ ఆర్‌డీ నాగరాజు, చిత్తూరు కమిషనర్ నరసింహప్రసాద్, పీడీఓ సి.పవన్‌కుమార్ పాల్గొన్నారు.


