8న సీబీఐటీలో స్ట్రాటో ఎక్స్‌మిషన్ శాటిలైట్ ఆవిష్కరణ
చాపాడు : స్థానిక చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 8న క్యాంపస్‌లో స్ట్రాటో ఎక్స్‌మిషన్ శాటిలైట్ ఆవిష్కరించనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ వి.జయచంద్రారెడ్డి తెలిపారు. 35 మంది విద్యార్థులు తయారు చేసిన శాటిలైట్‌ను హై ఆల్టిట్యూడ్ హీలియం బెలూన్స్ ద్వారా 35 కిలోమీటర్లు ఎత్తులో ఉండే స్ట్రాటో స్పియర్‌లోకి పంపనున్నారు. దీని ద్వారా కలిగే ఉపయోగాలను గుర్తిస్తూ ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు –2025 గుర్తించనుందని, విద్యార్థుల మేధస్సుకు దోహదపడుతుందని సీబీఐటీ కళాశాల చైర్మన్ తెలిపారు.
పోక్సో కేసు నమోదు
కడప అర్బన్ : కడప నగరంలోని తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో 14 సంవత్సరాల బాలికపై ప్రొద్దుటూరుకు చెందిన రెడ్డిబాబు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈసంఘటనపై బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై మంగళవారం పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కడప తాలూకా పోలీసులు తెలియజేశారు.
బెల్ట్‌షాప్‌పై దాడి
మైదుకూరు : మండలంలోని జీవీ సత్రంలో మంగళవారం పోలీసులు బెల్ట్‌షాపుపై దాడి చేసి 9 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ చిల్లర దుకాణంలో బెల్ట్ షాప నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో అర్బన్ ఎస్‌ఐ చిరంజీవి సిబ్బందితో దాడి చేశారు. జీవీ సత్రంలోని సీతారామనగర్‌లో పంగా సీతారామయ్య అనే వ్యక్తి తన చిల్లర దుకాణంలోనే బెల్ట్‌షాపు నిర్వహిస్తుండగా అతన్ని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయ ఆవరణంలో నాగుపాము దర్శనమిచ్చింది. కార్తీక రెండవ సోమవారం రాత్రి భక్తులు భారీగా వచ్చి అఘోర లింగేశ్వరుడికి పూజలు నిర్వహిస్తున్నారు. పూజలు పూర్తి చేసుకొన్న సమయంలో అమ్మవారికి, స్వామి వారికి కొబ్బరి కాయలు కొట్టగా కొబ్బరి నీళ్లు బయటకి వెళ్లే ప్రదేశం నుంచి ఈ పాము బయటికి వచ్చింది. దీనిని గమనించిన భక్తులు పాము....పాము అంటూ గట్టిగా కేకలు వేయగా ..ఆలయ అధికారులు పాము వెళ్లిన బొరియకు రాయి పెట్టి కప్పిపెట్టారు. పాము పట్టేవారిని పిలిపించి ఆ పామును పట్టుకొని సురక్షప్రదేశంలో వదిలిపెట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. పామును పట్టి తీసుకెళ్లడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ : తెలుగు తమ్ముళ్ల తన్నులాట రక్తపు చారలై పారింది. అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు తెగపడి దాడులలో తల బద్దలై ఆసుపత్రికి చేరిన తెలుగు తమ్ముడు శివాజీ నాయుడు ఉదంతం ఇది. ఇంత సంఘటన జరిగినా పోలీసులు కేసు నమోదు చేయకుండా అధికారాన్ని అడ్డు పెట్టినట్లు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సంబేపల్లె మండలం నారాయణరెడ్డిపల్లె సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఇరువర్గాల దాడి అటువైపుగా వెళుతున్న ప్రజలను భయాందోళనకు గురిచేసింది. సంబేపల్లె మండలం గుట్టపల్లె పంచాయతీకి చెందిన తెలుగు తమ్ముళ్లు రెండు వర్గాలుగా ఏర్పడి గత కొద్ది రోజులుగా కారాలు, మిరియాలు నూరుకొంటునట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రంలో జరిగిన డీఆర్‌సీ మీటింగ్ అయిపోయిన అనంతరం ఒక వర్గం గుట్టపల్లెకు స్కార్పియో వాహనంలో వెళుతున్న సమయంలో మరో వర్గం వెంబడించి నారాయణరెడ్డిపల్లె సమీపంలో వాహనాన్ని ధ్వంసం చేసి అందులో వున్న వారిపై దాడికి తెగబడింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివాజీనాయుడును 108 ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


