● వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడి
కళాశాల తొలగింపు పనులు
● రోడ్డు విస్తరణ పేరుతో హిటాచి యంత్రంతో వచ్చిన ఆయా శాఖల అధికారులు
● అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే
రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : రోడ్డు విస్తరణ పేరుతో స్థానిక సినీ హబ్ సమీపంలోని ఫేస్ టాప్ మైండ్ జూనియర్ కళాశాల భవనం యజమాని, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైన డాక్టర్ షాకీర్ ఖురేషికి చెందిన ఫేస్ టాప్ మైండ్ జూనియర్ కళాశాల భవనాన్ని తొలగించేందుకు మంగళవారం ఉదయమే అధికారులు సిద్ధమయ్యారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్‌శాఖ, పోలీసు, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు హిటాచి యంత్రం తీసుకుని భవన తొలగింపు పనులు చేపట్టేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి అడ్డుకున్నారు. తాను ముందుగా సూచించిన మేరకు కళాశాలకు చెందిన లిఫ్ట్‌ను పూర్తిగా తొలగించానని, ప్రస్తుతం ఇంకా రెండు అడుగుల మేర భవనాన్ని తొలగించాలని తనకు తరచూ అధికారులు ఫోన్ చేస్తున్నారని కళాశాల కరస్పాండెంట్ ఈ సందర్భంగా రాచమల్లుకు వివరించారు. ఎలాంటి ముందస్తు నోటీసు తమకు ఇవ్వలేదని, నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని తొలగించేందకు సిద్ధమయ్యారని తెలిపారు. ఎర్రగుంట్ల సర్కిల్ నుంచి రిలయన్స్ పెట్రోలు బంకు వరకు రోడ్డు విస్తరణ కోసం ఎక్కడా భవనాలను తొలగించే పనులు చేపట్టలేదని, మధ్యలో ఉన్న తమ కళాశాలపైకి వచ్చారన్నారు. తనకన్నా ముందున్న భవనాలను పరిశీలించాలని ఆయన అధికారులను కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితోపాటు ముక్తియార్‌ను కూడా కలిశానన్నారు. రూ.30లక్షలతో నిర్మించిన కళాశాల లిఫ్ట్‌ను తొలగించడంతో తమ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారని, ఇప్పుడు బలవంతంగా భవనాలను కూల్చివేస్తే తాము ఆత్మహత్య చేసుకోక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నుంచి తమ కళాశాల వరకు 27 అడుగుల విస్తీర్ణం ఉందన్నారు. పదే పదే అధికారులు ఫోన్ చేసి మీ భవనాన్ని తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. రాచమల్లు మధ్యాహ్నం 3 గంటల వరకు సంఘటన స్థలంలోనే ఉండి అధికారులతో మాట్లాడి వెళ్లారు.
ప్రొద్దుటూరులో దౌర్జన్యం రాజ్యమేలుతోంది
ప్రొద్దుటూరులో దౌర్జన్యం రాజ్యమేలుతోందని, అధికార జులం పరాకాష్టకు చేరిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్ల కిందటే మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకుని ఈ భవనాన్ని నిర్మించారన్నారు. అయితే కరస్పాండెంట్ అధికార పార్టీకి అనుకూలం కాదని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడనే ఉద్దేశంతో కూటమి పార్టీకి చెందిన ముస్లిం నాయకుడు ముక్తియార్ ఈ భవనాన్ని తొలగించాలని ఆదేశించారన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి అనుమతి లేకుండా ముక్తియార్ ఈ భవానాన్ని తొలగించగలరా అని ప్రశ్నించారు. నేతల సిఫారసు లేకుంటే తహసీల్దార్, విద్యుత్‌శాఖ, ఆర్‌అండ్‌బీ, పోలీసు, మున్సిపల్ అధికారులు ఇంత ఉదయాన్నే ఇక్కడికి వస్తారా అని ప్రశ్నించారు. కళాశాలలో సుమారు 200 మంది విద్యార్థులు చదువుతున్నారని, చెప్పా పెట్టకుండా తొలగిస్తే విద్యార్థులకు ప్రమాదం జరిగితే ఎవరు కారణమన్నారు. అసలు నోటీసు ఇవ్వకుండానే ఎలా ఇక్కడికి వచ్చారని ప్రశ్నించారు. కళాశాల కంటే ముందు భూమిలో ఆర్టీపీపీ పైపులైన్ నిర్మాణం ఉందని, దానిని ఎలా తొలగిస్తారన్నారు. 2019 నుంచి 2024 వరకు తాము ఎన్నో పనులు చేపట్టామని, ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లేల రాజారాంరెడ్డి, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్రం గౌస్, మున్సిపల్ కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, లావణ్య, జయంతి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మార్తల ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో అధికార జులుం


