ఆడపిల్లలకు చదువును దూరం చేయొద్దు
కమలాపురం : కూటమి ప్రభుత్వం ముస్లింలపై వివక్ష చూపిస్తోంది. ముస్లింలకు అండగా ఉంటాం.. ఆడపిల్లల చదువుకు చేయూతనిస్తాం.. అంటూ మాటల్లో ప్రేమ ఒలకబోస్తూ... చేతల్లో కర్కశత్వం చూపిస్తూ.. కపట నాటకమాడుతోంది. కమలాపురంలోని యూపీ ఉర్దూ స్కూల్‌ను రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడమే అందుకు నిదర్శనం. కమలాపురం పట్టణ పరిధిలోని బీడీ కాలనీలో ఉన్న ఉర్దూ యూపీ స్కూల్‌ను ప్రైమరీ స్కూల్‌గా మారుస్తూ ఉత్తర్వులు అందాయి. విషయం తెలుసుకున్న స్థానికులు .. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు. తమ కాలనీలోని యూపీ స్కూల్‌ను రివర్షన్ చేసి ఆడపిల్లలకు చదువును దూరం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు మహబూబ్ బాషా, షఫీవుల్లా, హబీబున్, మాబుచాన్ తదితరులు కోరారు. ఈ విషయమై వారు ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కాలనీలో మొత్తం బీడీ కార్మికులేనని, నిరుపేదలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 85 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలను తిరిగి రివర్షన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా తమ కాలనీలోనే ఈ పాఠశాల ఉండటంతో తమ పిల్లలు చదువుకుంటున్నారని, దీనిని ప్రైమరీ పాఠశాలగా మార్చి 6, 7 తరగతులను దూరంగా ఉన్న పాఠశాలల్లో కలిపితే తమ ఆడపిల్లలు చదువుకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలపై ప్రభుత్వం లక్షలు వెచ్చించి ఎంతో అభివృద్ధి చేసిందని, ఇలాంటి సమయంలో యూపీ పాఠశాలగా తీసివేయడం బాధాకరమన్నారు. చెన్నూరు మండలంలోని ఒక పాఠశాలలో కేవలం 25 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నప్పటికీ ఆ పాఠశాలను యూపీ పాఠశాలగానే కొనసాగిస్తున్నారని, మరి తమ బీడీ కాలనీలోని యూపీ పాఠశాలకు ఎందుకు రివర్షన్ ఇస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు.
విద్యార్థినుల తల్లిదండ్రుల ఆవేదన
యూపీ ఉర్దూ స్కూల్ రివర్షన్‌పై
మండిపాటు


