బెర్త్ దక్కేనా!
బడ్జెట్‌లో ‘బాలాజీ’కి
భారతదేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్‌ను
ఈ సారైనా పట్టాలెక్కిస్తారా.. గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలనే ఐదు జిల్లాల ప్రజల డిమాండ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా... కేంద్ర బడ్జెట్‌లో ‘బాలాజీ’కి బెర్త్ దక్కుతుందా... ఈ సందేహాలకు సమాధానాలు దొరకాలంటే .. మరో రెండు వారాల్లో
ప్రవేశపెట్టనున్న బడ్జెట్ వరకు ఆగాల్సిందే.
రాజంపేట: తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ప్రతిపాదనకు కేంద్రం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ఐదు జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఏటా కేంద్ర బడ్జెట్ సమయంలో ఆశగా చూడడం.. ఆపై నిరాశ చెందడం పరిపాటిగా మారింది. అన్ని అనుకూల అంశాలు ఉన్నా బాలాజీ డివిజన్ ఏర్పా టుకు ఇంకెన్నాళ్లు పడుతుందని సీమ వాసులు ప్రశ్నిస్తున్నారు. మరో 13 రోజుల్లో పార్లమెంట్‌లో కేంద్రబడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల జరిగే రాష్ట్రాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తారని, కొత్త డివిజన్లు, కొత్తరైలు మార్గాలు ప్రకటన ఉంటుందని రైల్వేనిపుణులు భావిస్తున్నారు. రైల్వేట్రాక్ మీద రాజకీయభవిష్యత్తును ఉంచుకునే దిశగా కేంద్రం బడ్జెట్ రూపకల్పన ఉంటుందని వివరిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలో దశాబ్దాల కలగా ఉన్న బాలాజీ డివిజన్‌కు కేంద్రబడ్జెట్‌లో చోటులభిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
బాలాజీ డివిజన్ ఏర్పాటైతే..
తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటుపై రైల్వేబోర్డు పునరాలోచించాలనే డిమాండ్ తారాస్థాయికి చేరుకుంటోంది. కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కలుపుకొని బాలాజీ డివిజన్ ఏర్పాటు చేస్తే, ఆ జిల్లాలోని రైలుమార్గాలకు, రైల్వే ప్రాంతాలకు మహర్దశ పడుతుందని రైల్వే నిపుణులు చెబుతున్నారు. సౌత్‌కోస్ట్ జోన్ ఏర్పాటుకు హద్దులు తీసుకొచ్చిన రైల్వేబోర్డు తిరుపతి బాలాజీ డివిజన్ ఏర్పాటు గురించి మరిచింది.
గుంతకల్ అడ్డంకినా?
గుంతకల్ డివిజన్ నుంచి విడిపోయి, బాలాజీ డివిజన్ ఏర్పాటైతే ఇందులో తిరుపతి–గూడూరు (92.96కిమీ), తిరుపతి–కాట్పాడి (104.39కిమీ),పాకాల–మదనపల్లె (83కిమీ), రేణిగుంట–కడప (125కిమీ)లైను కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. గుంతకల్ డివిజన్ కేంద్రానికి వెళ్లి రావాలంటే అధికారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లతోపాటు కొత్తగా బాలాజీ డివిజన్ ఏర్పాటుచేసి విశాఖజోన్‌లో కలిపితే బాగుంటుందని రైల్వే నిపుణులు అంటున్నారు. ఆ దిశగా కూటమి ఎంపీలు రైల్వేమంత్రిత్వశాఖపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఎంపీలు పీవీమిథున్‌రెడ్డి, గురుమూర్తి, మేడా రఘునాథ రెడ్డి అనేక మార్లు కేంద్రానికి బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ విన్నవించిన విషయం తెలిసిందే.
● కొత్త జోన్ ఏర్పడిన తరుణంలో కొత్త డివిజన్‌గా ఏళ్లతరబడి ప్రతిపాదనలో ఉన్న బాలాజీ డివిజన్ ఏర్పాటుపై కూటమి ఎంపీల ఆలోచన ఏమిటో ప్రజలకు అర్థం కావడంలేదు. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌గా చేయాలని ప్రజల నుంచి కేంద్రానికి వినతులు వెళుతున్నాయి. ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి ఎంపీలు సదరు అంశంపై గళమెత్తకపోవడంపైజనం మండిపడుతున్నారు.
తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు జరిగేనా!
ఈ సారైనా పట్టాలెక్కిస్తారా !
గళం విప్పని కూటమి ఎంపీలు
బెర్త్ దక్కేనా!


