అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బద్వేలు అర్బన్ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి మున్సిపాలిటీ పరిధిలోని సి.బోయనపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మున్సిపాలిటీ పరిధిలోని సి.బోయనపల్లె గ్రామానికి చెందిన లక్షుమయ్య, రామసుబ్బమ్మల కుమార్తె అయిన రమాదేవి (36) సుమారు 18 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన విజయభాస్కర్‌రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా విజయభాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కొన్నేళ్లుగా సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి విజయభాస్కర్‌రెడ్డి తన అన్న అయిన రమణారెడ్డితో కలిసి మద్యం తాగి వచ్చాడు. ఈ సమయంలో మీ అన్నతో కలిసి ఎందుకు మద్యం సేవించావని రమాదేవి విజయభాస్కర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగింది. దీంతో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన విజయభాస్కర్‌రెడ్డి గంట సేపటి తర్వాత.. ఇంటికి తిరిగి వచ్చేసరికి రమాదేవి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందికి దించి పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతురాలి తల్లి రామసుబ్బమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఏఎస్‌ఐ చంద్రనాయక్ కేసు నమోదు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.


