దేవునికడపలో బ్రహ్మోత్సవ సందడి
కడప సెవెన్‌రోడ్స్: దేవుడికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 27వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపధ్యంలో టీటీడీ జేఈఓ వల్లూరు వీరబ్రహ్మం శనివారం అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు వేలాదిగా తరలి వస్తారు గనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఈనెల 24వ తేది ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణం, 25న రథోత్సవంలో ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఈలు వెంకటేశ్వర్లు, మనోహరం, వీజీఓ గిరిధర్, టీటీడీ డిప్యూటీ ఈఓ ప్రశాంతి, ఆలయ అర్చకులు మయూరం కృష్ణమోహన్, ఇతర టీటీడీ అధికారులతో పాటు చిన్నచౌకు సీఐ ఓబులేశు, ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
దేవునికడపలో బ్రహ్మోత్సవ సందడి


