దేవదేవుడికి బ్రహ్మోత్సవం..
బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు
భక్తజనానికి సంబరం!
కడప సెవెన్‌రోడ్స్: తిరుమలేశుడి సన్నిధికి ఆయన క్షేత్రమే తొలిగడప. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే తిరుమల వెంకన్నకు చెందుతాయని భక్తుల్లో గొప్ప నమ్మకం. జిల్లా ప్రజలు ఆయనను తమ ఆరాధ్య దైవంగా తరతరాలుగా సేవిస్తున్నారు. ఈ ఆలయానికి అనేక చారిత్రక విశేషాలు ఉన్నాయి. జిల్లాలో జరిగే అతి పెద్ద తిరునాల ఉత్సవంగా ఈ బ్రహ్మోత్సవాలకు పేరుంది. మరి ఇంతటి ఘనచరిత కలిగిన స్వామికి బ్రహ్మోత్సవాలంటే ఊరంతా ఉత్సాహంగా ఉండడం సహజమే కదా!
● ఆదివారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడిగా, కడప రాయుడిగా భక్తులచే కొనియాడబడే ఆయన బ్రహ్మోత్సవాలంటే జిల్లా వాసుల్లో ఎనలేని ఉత్సాహం ఉంటుంది. వారం రోజులపాటు ప్రతిరోజు ఓ అలంకారంలో తమ ఇష్టదైవాన్ని చూసుకోవాలని ఆశ పడతారు. మరీ ముఖ్యంగా కల్యాణోత్సవం నాడు కళ్లింతలుగా చేసుకుని స్వామి, అమ్మవార్లను మనసారా దర్శించుకుంటారు. రథోత్సవం నాడు స్వామి సాక్షాత్తు ఆకాశం నుంచే దర్శనమిస్తున్నాడని భావిస్తూ రథంపైనున్న స్వామికి రెండు చేతులెత్తి గోవిందనామ స్మరణలు చేస్తూ దర్శించుకుంటారు.
నేటి నుంచి ఉత్సవాలు
తిరుమలకు తొలిగడపగా భక్తులు భావించే దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం అంకురార్పణతో శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ వారం రోజులపాటు విశేష పూజోత్సవాల నిర్వహణకోసం స్థానిక అర్చక బృందం సిద్దమైంది. ఇప్పటికే ఆలయాన్నంతా కన్నుల పండువగా అలంకరించారు. రంగురంగుల ముగ్గులు తీర్చారు. ఆలయంతోపాటు దేవునికడప గ్రామమంతా విద్యుద్దీపాలను అలంకరించారు. ఇటు కృష్ణాసర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపుల సీరియల్ సెట్లు అలంకరించి ఆలయం నుంచి మైక్ సెట్లను ఏర్పాటు చేశారు. ఆలయంలో జరుగుతున్న పూజోత్సవాల గురించి వీటి ద్వారా నగర వాసులకు నేరుగా ప్రసారం అయ్యే అవకాశం కల్పించారు.
భక్తుల సౌకర్యం కోసం
ఈ సంవత్సరం దేవునికడప తిరునాలను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించేందుకు సిద్దమయ్యారు. జేఈఓ వీరబ్రహ్మం శనివారం ఉదయం ఆలయాన్ని సందర్శించి ఉత్సవాల నిర్వహణపై అవసరమైన సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాల నేపధ్యంలో దేవునికడప గ్రామమంతా ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఉత్సవాల సందర్భంగా రథోత్సవం నాడు స్వామి వారిని కొలువుదీర్చేందుకు తేరును కూడా అందంగా ముస్తాబు చేసి సిద్ధం చేశారు. ప్రతిరోజు ఉత్సవ పూజలు నిర్వహించేందుకు అర్చక బృందం సన్నాహాలు చేస్తోంది.
నేడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీ లక్ష్మివెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివారం జరిగే అంకురార్పణ పూజలతో ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో ప్రధానంగా భావించే కార్యక్రమాల్లో 19న ధ్వజారోహణం, 23న గరుడ వాహన సేవ, 24 కల్యాణోత్సవం, 25న రథోత్స వాన్ని నిర్వహించనున్నారు. 28న జరగనున్న పుష్ప యాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
18వ తేదీ ఉదయం దీక్ష తిరుమంజనం, సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 19న ఉదయం ధ్వజారోహణం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి. 20న ఉదయం సూర్యప్రభవాహనం, రాత్రి పెద్దశేష వాహనం, 21న చిన్నశేష వాహనం, రాత్రి సింహ వాహనం, 22న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం, 23న ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి గరుడ వాహన సేవలు ఉంటాయి. అలాగే 24న ఉదయం స్వామివారి కల్యాణోత్సవం జరుగుతుంది. రాత్రి గజ వాహన సేవ ఉంటుంది. 25న ఉదయం రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం, 26 ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వ వాహనం,27న వసంతోత్సవం, చక్రస్నానం హంస వాహనం, ధ్వజావరోహణం, 28న పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి.
27వ తేదీ వరకు ఉత్సవాలు
నేడు అంకురార్పణ పూజలు
ఏర్పాట్లపై జేఈఓ వీరబ్రహ్మం సమీక్ష
తిరుమల తొలిగడపగాదేవునికడప ఆలయానికి గుర్తింపు
జిల్లాలో పెద్ద తిరునాలగాస్వామి వారి బ్రహ్మోత్సవం
చారిత్రక విశేషాలుగల ఆలయంగా ఖ్యాతి
24న స్వామి వారి కల్యాణోత్సవం...25న రథోత్సవానికి ఏర్పాట్లు
బ్రహ్మోత్సవ శోభతో అలరారుతున్నదేవునికడప ఆలయం
నేడు అంకురార్పణ పూజలతోఉత్సవాలు ప్రారంభం


