భక్తుల కొంగుబంగారం బలిజపల్లె గంగమ్మ | - | Sakshi
Sakshi News home page

భక్తుల కొంగుబంగారం బలిజపల్లె గంగమ్మ

Apr 1 2025 12:36 PM | Updated on Apr 1 2025 3:27 PM

భక్తుల కొంగుబంగారం బలిజపల్లె గంగమ్మ

భక్తుల కొంగుబంగారం బలిజపల్లె గంగమ్మ

రాజంపేట టౌన్‌ : రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని బలిజపల్లెలో స్వయంభువుగా వెలసిన గంగమ్మ ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో ఎంతో విశిష్టత సంతరించుకుంది. రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ జాతరకు ఏటా లక్ష మందికిపైగా భక్తులు హాజరై అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. అమ్మవారికి వరపడితే తమ కష్టాలు తొలగిపోతాయని, కోరిన కోర్కెలు గంగమ్మ నెరవేరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే బలిజపల్లె గంగమ్మ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతుంది. బుధవారం రాత్రి నుంచి జాతర ప్రారంభం కానుంది.

సంప్రదాయాల సమ్మేళనం

బలిజపల్లె గంగమ్మ జాతర అనేక సంప్రదాయాల సమ్మేళనం. బలిజపల్లె, తుమ్మల అగ్రహారం, నారపురెడ్డిపల్లె గ్రామ ప్రజలు కలిసి అమ్మవారి జాతర నిర్వహిస్తారు. తొలుత బలిజపల్లె వాసులు తేదీ నిర్ణయించి అనంతరం తుమ్మల అగ్రహారం, నారపురెడ్డిపల్లె నిర్వాహకులతో చర్చిస్తారు. అంగీకారం రాగానే జాతర తేదీ ఖరారు చేశారు. ఆదివారం జాతరకు అంకురార్పణ చేసి గురువారం జాతర నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల ప్రజలు అమ్మవారికి వివిధ రకాల సాంగ్యలతో జాతర ఘనంగా నిర్వహిస్తారు.

బలిజపల్లెలో అమ్మవారి ప్రతిమ

జాతరలో కొలువుదీరే గంగమ్మ ప్రతిమను బలిజపల్లెలోని ఓ వేపచెట్టు కింద దాదాపు ఆరు గంటల పాటు కష్టపడి తయారుచేస్తారు. అనంతరం ప్రతిమను నిర్వాహకులు పూల రథంపై ఊరేగిస్తారు. వేపమండలతో తయారు చేసిన గుండిలో తీసుకొచ్చి కొలువుదీర్చుతారు. అమ్మవారు గుడిలోకి వచ్చే సమయంలో భక్తులు పెద్దఎత్తున నైవేద్యాలు ఎదురుగుంభంగా ఇచ్చేందుకు పోటీపడతారు. యాబై అడుగుల దూరంలో ఉండే గుడిలోకి అమ్మవారిని తీసుకురావడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. బలిజపల్లె నిర్వాహకులు విశేషంగా పూజలు నిర్వహించి సాంగ్యలు సమర్పిస్తారు. అమ్మవారు కొలువుదీరగానే జాతర ఊపందుకుంటుంది.

తుమ్మల అగ్రహారం నుంచి గండదీయలు

బలిజపల్లెలో కొలువైన గంగమ్మకు తుమ్మలఅగ్రహారం పుట్టినిల్లు అని పెద్దలు చెబుతారు. దీంతో గ్రామ మహిళలు బుధవారం రాత్రి బలిజపల్లె గ్రామానికి గండదీయలను తీసుకెళ్తారు. గురువారం వేకువ జామున గుడిలో కొలువుదీరాక మహిళలు తీసుకొచ్చిన గండదీయలను చెల్లిస్తారు. ఈ సమయంలో గంగమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది బారులు తీరుతారు. అగ్రహారం మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చి చెల్లించే ఏర్పాట్లుచేస్తారు.

నారపురెడ్డిపల్లె నుంచి నవధాన్యాలు

జాతర సందర్భంగా గంగమ్మ తల్లికి నారపురెడ్డిపల్లెకు చెందిన జాతర నిర్వాహకులు, ప్రజలు బుధవారం రాత్రి నవ ధాన్యాలు తీసుకొస్తారు. గంగమ్మ సోదరుడైన పోతు రాజును తప్పెట్లతో ఉత్సాహంగా బలిజపల్లెకు తీసుకొస్తారు. పోతురాజు ఊరేగుతూ వచ్చే సమయంలో భక్తులు కర్రసాము, ఐదడుగుల వ్యక్తులు నృత్యాలు చేస్తూ కోలాహలంగా బలిజపల్లెకు చేరుకుంటారు.

రేపు రాత్రి నుంచి జాతర ప్రారంభం

జాతరకు రెండు వందల ఏళ్ళకు పైగా చరిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement