● వరాల పర్వదినానికి ఎదురుచూపులు
● మార్కెట్లకు రంజాన్ కళ
● కొనుగోలుదారులతో దుకాణాలలో రద్దీ
● ఉట్టిపడుతున్న ఆధ్యాత్మిక వాతావరణం
కడప కల్చరల్ : పవిత్ర రంజాన్ మాసం దగ్గరకు వచ్చేసింది. పండుగ నిర్వహణ కోసం వస్తువులు కొనుగోలు చేస్తున్న ముస్లింలతో ప్రధాన మార్కెట్లు సందడిగా మారాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి దాదాపు దుకాణాలన్నీ మహిళలతో నిండిపోతున్నాయి. మార్కెట్ ప్రధాన వీధులు కూడా జనసందోహంతో కనిపిస్తున్నాయి.
పవిత్ర మాసం..
మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దే మాసం....ఆత్మార్పణతో అల్లాహ్‌కు దగ్గరయ్యే అవకాశం గల మాసం. దివ్య గ్రంథం ఖురాన్ భువికి దిగిన మాసం. ప్రతి ముస్లిం జీవితంలో పట్టలేని ఆనందం కలిగించే మాసం. నెల రోజులపాటు ఆధ్యాత్మిక చింతనతో గడిపే అవకాశం కల్పించిన మాసం రంజాన్. సంవత్సర కాలంపాటు ముస్లింలు ఈ పండుగ కోసం ఎదురుచూస్తారు. అలాంటి ఆనందకరమైన రోజు వరాల వసంతాలను కురిపించే రోజు పవిత్ర రంజాన్ పండుగ కేవలం ఒక్క రోజు తర్వాత రానుంది. దీని కోసం భక్తుల నెల రోజుల నిరీక్షణ ముగియనుంది. ముస్లిం లోకం నెల రోజులపాటు భక్తిశ్రద్ధలతో కఠినంగా ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్నారు. మరొక్క రోజు తర్వాత దీక్షలు పూర్తయి ఎదురుచూస్తున్న రంజాన్ పండుగ రానుంది. ఈ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలన్న భావనతో ఉన్నంతలో మరువలేని విధంగా గడపాలన్న ఆశతో తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మార్కెట్లలో రద్దీ
రంజాన్ పండుగ నిర్వహణ కోసం కొనుగోలు చేసేందుకు వచ్చే వారితో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడప నగరంలోని వైవీ స్ట్రీట్‌లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచే కొనుగోలుదారుల రద్దీ కనిపిస్తోంది. ఇటీవల ఎండ తీవ్రత పెరుగుతుండడంతో మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనుగోళ్లు కాస్త పలుచబడుతున్నాయి. సాయంత్రం నుంచి దుకాణదారులు రాత్రి 11 గంటల వరకు కూడా షాపులు తెరిచి పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వైవీస్ట్రీట్ ప్రధాన రోడ్డు పూర్తిగా ముస్లిం మహిళలే కనిపిస్తున్నారు. ముస్లింలు కుటుంబ సభ్యులతోసహా షాపింగ్ చేసేందుకు తరలి వస్తుండడంతో ఆ రోడ్డులో నడిచేందుకు సమయం పడుతోంది. ముఖ్యంగా ఒకవైపు పండుగ నిర్వహణ కోసం ప్రత్యేక సామాగ్రి, మరోవైపు ఇంటిల్లిపాదికి దుస్తులు, పాదరక్షలు కొనుగోలు హడావుడి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రెడీమేడ్ దుకాణాలలో జనం కిటకిటలాడుతున్నారు. ముఖ్యంగా సెంటు, అత్తరు దుకాణాలు, మెహందీ విక్రయించే దుకాణాలు, సేమియా దుకాణాల వద్ద సందడిగా ఉంది.
పండగ కళ
జిల్లాలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నీ క్రమంగా పండుగ కళను సంతరించుకుంటున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, రాజంపేటతోపాటు మన జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు తదితర ప్రాంతాలలో మసీదులు, ఈద్గాలకు కొత్త కళ కల్పిస్తున్నారు. ముస్లింలలో భక్తిశ్రద్ధలతోపాటు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రధాన మార్కెట్లతోపాటు ఇతర మెయిన్‌రోడ్డులోగల దుస్తుల దుకాణాలు కళకళలాడుతున్నాయి. మరోవైపు నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలలో రద్దీ అలాగే ఉంది. పండ్ల దుకాణాలు, తోపుడు బండ్లపై పండ్లు విక్రయించే ప్రాంతాలలో కూడా రద్దీ కనిపిస్తోంది. హలీం, తదితర ప్రత్యేక ఇస్లామిక్ వంటకాలు విక్రయించే దుకాణాలు రంగురంగుల విద్యుద్దీపాలతో కళకళలాడుతున్నాయి. పలుచోట్ల మసీదులను సైతం విద్యుద్దీపాలతో కనుల పండువగా అలంకరించి ఆరోజున రంగురంగుల కాంతులు వెదజల్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
‘షాన్‌దార్’ రంజాన్ కోసం ‘దిల్‌దార్’ ఏర్పాట్లు


