ప్రతి నెల వీధుల్లోకి వచ్చే ఎండీయూ వాహనం వద్ద బియ్యం, చక్కెర, ఇతర సరుకులు తీసుకోవాలంటే రేషన్‌కార్డు ఉండాలి. అలాగే పెన్షన్, పక్కాగృహం, వైద్య సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్‌కార్డు తప్పనిసరి. దారిద్య్రరేఖకు దిగువ జీవిస్తున్న ప్రజలకు ఎన్నో విషయాల్లో రేషన్‌కార్డు అండగా ఉందన్న విషయం ఎవరూ కాదనలేని సత్యం. అలాంటి రేషన్‌కార్డు రద్దయితే ఆ కుటుంబ జీవనం అల్లకల్లోలంగా మారుతుంది. జిల్లాలో ఇప్పటికీ అనేక మంది రేషన్‌కార్డులేని కుటుంబాలు ఉన్నాయి. అర్హులైన వీరందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఉంది. అలా జారీ చేయకపోగా ఈకేవైసీ పేరుతో, తక్కువ గడువు ఇవ్వడమంటే ఉన్న కార్డులను తొలగించడానికేన్న విమర్శలు సర్వత్రా వెలువడుతున్నాయి. ఎంతమందికి ఈకేవైసీ లేకపోతే అంతమందికి సంక్షేమ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కనుక ప్రభుత్వం ఇప్పటికై నా ఈకేవైసీ గడువు పొడిగించాలని ప్రజలు, రాజకీయ పక్షాలు కోరుతున్నాయి.


