కళ్లద్దాలకు..అవినీతి మసక ! | - | Sakshi
Sakshi News home page

కళ్లద్దాలకు..అవినీతి మసక !

Mar 20 2025 12:12 AM | Updated on Mar 20 2025 12:12 AM

కళ్లద

కళ్లద్దాలకు..అవినీతి మసక !

‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అనే సంగతిని మరిచారు. పాపం.. దృష్టి లోపంతో బాధపడుతున్న చిన్నారుల కళ్లద్దాలపై అవినీతి కన్ను పడింది. నాసిరకం కళ్లద్దాలను పంపిణీ చేశారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థలో వెలుగు చూసిన అక్రమాలు విస్మయం కలిగిస్తున్నాయి.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్ణయించింది. ఆ మేరకు కళ్ల జోళ్ల పంపిణీ కోసం 2025 జనవరి 4వ తేదీన టెండర్లు పిలిచారు. ఇందులో జిల్లాలోని పాఠశాల విద్యార్ధులకు కంటి పరీక్షల కార్యక్రమంలో భాగంగా దృష్టి లోపంతో బాధపడుతున్న 5,200 మందికి ఉచితంగా కళ్ల జోళ్లను పంపిణీ చేయాలి. సకాలంలో మంచి నాణ్యత గల కళ్ల జోళ్లు అందించగల సంస్ధల నుంచి టెండర్లను ఆహ్వానించారు. టీఆర్‌–90/పాలీకార్బొనేట్‌ ఫుల్‌ ఫ్రేమ్‌ (బాలురు, బాలికలకు వివిధ రకాల రంగుల్లో) లెన్స్‌:సీఆర్‌–39 (ప్లాస్టిక్‌ లెన్స్‌) నాణ్యత కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన సరఫరాదారులు తమ కనిష్ట ధరను సీల్డ్‌ కవర్‌లో ఉంచి నమూనా ఫ్రేముతో పాటుగా 6 నుంచి 17వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు జిల్లా అంధత్వ నివారణ సంస్థ (జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌)కు అందజేయాలని సూచించారు. కాగా టెండరు ప్రకటనలో వైఎస్సార్‌ కడప జిల్లా పరిధిలోని సంస్థల (ఆప్టికల్‌ షాపుల యాజమాన్యాలు) వారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలని షరతు విధించారు. గతంలో ఇలా ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రమే జిల్లాలో ఉన్న వారికి మాత్రమే టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించడంపై అనుమానాలు తలెత్తాయి. ఇలా ఆదిలోనే అక్రమాలకు బీజం పడినట్లయింది.

అనుకూలమైన వారికి వచ్చేలా చక్రం తిప్పారు..

ఈ టెండర్లలో జిల్లాకు చెందిన వారు మొత్తం నలుగురు పాల్గొన్నారు. అందులో కడప నగరానికి చెందిన ఆప్టికల్‌ షాపు యజమాని రూ.270 విలువైన నాణ్యమైన కళ్లద్దాలు, బాక్స్‌ను పంపిణీ చేస్తానని టెండర్‌లో పొందుపరిచారు. మిగతా ముగ్గురు అంతకంటే తక్కువ ధరను కోట్‌ చేశారు. వాస్తవానికి టెండర్‌ తక్కువ ధరకు వేసిన వారికే రావాలి. అయితే ఇక్కడ కడప నగరానికి చెందిన పంపిణీదారుడికి టెండర్‌ దక్కాలని మిగతా ముగ్గురు టెండర్‌దారులతో మధ్యవర్తిత్వం నడిపారు. ఒప్పందం కుదిర్చారు. దీంతో సిండికేట్‌గా మారారు. అందుకు గాను ఒకరికి రూ 1.70 లక్షలు, మిగతా ఇద్దరికి రూ.70 వేలు చొప్పున డబ్బును ముట్టజెప్పినట్లు తెలిసింది. ఫలితంగా టెండర్ల నుంచి ముగ్గురు తప్పుకోవడంతో కడప నగరానికి చెందిన పంపిణీదారుడి టెండర్‌ సీల్డ్‌ కవర్‌ను బాక్స్‌లో వేశారు. ఆ బాక్సులో ఉన్న కవర్‌ను జాయింట్‌ కలెక్టర్‌ చాంబర్‌లో తెరిచారు. టెండర్‌ తమకు అనుకూలమైన కడప నగరానికి చెందిన పంపిణీదారుడికి దక్కేలా చేసే విషయంలో అధికారులకు..టెండర్‌దారులకు మధ్య డీల్‌ కుదిరేలా ఒక ఆప్తాలమిక్‌ ఆఫీసర్‌ వ్యవహారం నడిపారనే ఆరోపణలున్నాయి.

నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేశారు..

కళ్ల జోళ్ల నాణ్యతా ప్రమాణాలను ఆ విభాగంలో పనిచేసే ఆప్తోమెట్రిస్ట్‌ (అద్దాలను పరీక్షించేవారు), ఆప్తాలమిక్‌ ఆఫీసర్స్‌ (కంటి వైద్యాధికారులు) పరీక్షిస్తారు. అలాగే ఈ నాణ్యతా పరీక్షలను రిమ్స్‌ కంటి వైద్యులు నిర్వహించాలి. ఈ నిర్ధారణ పరీక్షల్లో నాణ్యమైన అద్దాలని తేలితేనే విద్యార్థులకు అందజేయాలి. అయితే ఈ ప్రమాణాలను పాటించిన దాఖలాలు లేవు. కాగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆప్తాలమిక్‌ ఆఫీసర్స్‌ 15 మంది పనిచేస్తున్నారు.

లక్షలు నొక్కేశారు..

ప్రస్తుతం రూ.270తో పంపిణీ చేసిన కళ్ల జోళ్లు ఒక ప్రముఖ కంటి వైద్యశాలలో రూ. 60–80కే లభిస్తున్నట్లుగా అనుకుంటున్నారు. ఆ ప్రకారం ఒక జత కళ్ల జోళ్ల ధర రూ.270తో అయితే మొత్తం రూ.14.04 లక్షలు అవుతుంది. అదే రూ.80తో వేసుకుంటే మొత్తం రూ. 4.16 లక్షలు అవుతుంది. అంటే దాదాపుగా రూ.10 లక్షల వరకు చేతులు మారాయి. ఈ అంశాలపై ఇంటా..బయటా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవినీతి వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

కడప పాత

రిమ్స్‌లోని

జిల్లా అంధత్వ నివారణ సంస్థ కార్యాలయం

టెండర్ల ఆహ్వానంలోనే మతలబు

5,200 మంది విద్యార్థులకు

నాసిరకం కళ్ల జోళ్లు అందజేత

రూ.లక్షలు నొక్కేసిన వైనం

జిల్లా అంధత్వ నివారణ సంస్థలో అక్రమాలు

కళ్లద్దాలకు..అవినీతి మసక !1
1/1

కళ్లద్దాలకు..అవినీతి మసక !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement