కడప ఎడ్యుకేషన్ : జమ్మలమడుగు పట్టణంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల కళాశాల వసతి గృహంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నరేంద్ర, సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. కడపలోని వారి కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో అనేక సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ సంఘటనలపై విచారణ చేపట్టి విద్యార్థులకు అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఆరు నెలల క్రితం ఇదే హాస్టల్‌లో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యకు యత్నించారన్నారు. అప్పుడే విచారణ జరిపి చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఈ సంఘటన జరిగి ఉండేది కాదన్నారు. స్థానికంగా నివాసం ఉండాల్సిన ఏఎస్‌డబ్ల్యూఓ గురుప్రసాద్ తన 35 ఏళ్ల సర్వీసులో ఏ ప్రాంతంలో పనిచేసినా పులివెందులలో నివాసం ఉండి విధులకు సక్రమంగా హాజరు అయ్యేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు నరసింహ, గోపి, అయ్యన్న, రామ్‌చరణ్ పాల్గొన్నారు.