పేరుకే ఉచితం.. అంతా బూటకం
కడప కోటిరెడ్డిసర్కిల్: అలవిగాని హామీలతో అందలమెక్కిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు తాము చెప్పిన అబద్ధాలపై ఇసుక కోటలు కడుతోంది. ఇసుక ఉచితమని ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడేమో వసూళ్లకు తెర లేపేందుకు సిద్ధమవుతోంది. రవాణా, లోడింగ్ చార్జీల పేరుతో వినియోగదారులపై భారం మోపుతోంది. తమకు కప్పం కట్టాల్సిందేనంటూ తెగేసి చెప్పేసింది. సామాన్యుడి నడ్డి విరిచేలా ఇసుక ధరతోపాటు లోడింగ్ చార్జిలు, ట్రావెలింగ్ చార్జీలు అదనమంటూ తేల్చేసింది. మరోవైపు లోడింగ్, రవాణా చార్జీల పేరుతో వ్యవస్థలన్నీ తన గుప్పిట్లో పెట్టుకునేలా టీడీపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే డిపోల్లో ఇసుకను దోచుకున్న టీడీపీ వర్గీయులు ఇక కృత్రిమ కొరతను సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.
● రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎలాంటి లాభాపేక్ష లేదంటూనే ఇసుక వ్యాపారానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రీచ్‌ల నుంచి యార్డులకు తరలించడానికి అయ్యే నిర్వహణ వ్యయాన్ని మాత్రమే వసూలు చేస్తామంటూ టన్ను ఇసుకను భారీ ధరకు విక్రయిస్తున్నట్లుగా ప్రకటించింది. నిన్నటివరకు ఇసుక విధానంపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించి తాజాగా కూటమి ప్రభుత్వం చివరికి అదే పాలసీని అమలు చేస్తూ ధరను పెంచేలా భారం మోపుతోంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం ప్రజల కళ్లల్లో ఇసుక కొట్టింది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెడుతూ ఇసుక పాలసీని తెచ్చింది. అయితే అప్పటి ప్రతిపక్ష టీడీపీ ఇసుక విక్రయాలపై దుష్ప్రచారం చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామంటూ గొప్పలు చెప్పింది. అయితే వాస్తవానికి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక పేరుతో రీచ్‌లను దోచుకున్నారు. తాజాగా మరోసారి టీడీపీ ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తామంటూ ప్రగల్బాలు పలికి ధరను నిర్ణయించి మరోసారి ప్రజలను మోసం చేస్తోంది.
జిల్లాలో 11 స్టాక్ యార్డులు .. జిల్లాలో మొత్తం 11 స్టాక్ యార్డులు ఉన్నాయి. ఇసుకను ఆయా నిల్వ కేంద్రాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో టన్ను ప్రకారం కొండాపురం మండలంలోని కె.వెంకటాపురం, పి. అనంతపురం నుంచి రూ.340, కమలాపురం రూ.341, సిద్దవటం మండలంలోని జ్యోతి రూ.340, బద్వేల్ రూ.468, పోరుమామిళ్ల రూ.587, పెండ్లిమర్రి మండలంలో పడగాలపల్లి, కొత్తూరులలో రూ.340, వీఎన్ పల్లె మండలంలోని ఎర్రబల్లి రూ.340, పులివెందుల రూ.468, మైదుకూరు రూ.400 చొప్పున వినియోగదారులు చెల్లించాలన్నారు. దీనికి రవాణా చార్జీలు అదనం.
లోడింగ్, రవాణా చార్జీల పేరుతో వినియోగదారులపై భారం
టీడీపీ నేతల పక్కా వ్యూహంతో దోపిడీ
రీచ్‌లోనే లోడింగ్ చేసుకునే సౌకర్యం కల్పించాలి
సాండ్ స్టాక్ యార్డులో కాకుండా రీచ్‌లోనే సాండ్ లోడింగ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. గత ప్రభుత్వంలో టన్నుకు రూ.475 వసూలు చేసేవా రు. ఇపుడు టన్నుకు రూ.341 వసూలు చేస్తున్నారు. అప్పు డు ఉచితం ఎలా అవుతుంది. ప్రభుత్వం స్పందించి రీచ్‌లోనే రూ.250తో లోడింగ్ చేస్తే మేలు చేకూరుతుంది. –సద్దాం హుసేన్, వినియోగదారుడు,గువ్వల చెరువు, కడప.
పేరుకే ఉచితం.. అంతా బూటకం


