Sakshi News home page

జెడ్పీలో కారుణ్య నియామకాలు

Published Sat, Jul 8 2023 8:14 AM

జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డిని సత్కరిస్తున్న ఉద్యోగులు  - Sakshi

కడప సెవెన్‌రోడ్స్‌ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జిల్లా పరిషత్‌లో జూనియర్‌ సహాయకులుగా, ఆఫీసు సబార్డినేట్‌గా కారుణ్య నియామకాలు కల్పించారు. శుక్రవారం జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి వీరికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారు తమ కుటుంబాలకు ఆసరాగా నిలవాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతూ మరోవైపు ఉద్యోగ విధులను నిబద్ధతతో నిర్వర్తించాలన్నారు. జిల్లా పరిషత్‌లో కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైళ్లు ఆలస్యం లేకుండా క్లియర్‌ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా కారుణ్య నియామకాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

పదోన్నతులు
జూనియర్‌ అసిస్టెంట్లుగా పని చేస్తున్న ఏడుగురికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి వివిధ ప్రాంతాలకు బదిలీ చేసినట్లు జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అంకాలమ్మ గూడూరులో పని చేస్తున్న ఎస్‌.రాంప్రతాప్‌ను బి.మఠం ఎంపీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. కలసపాడు ఎంపీపీలో ఉన్న బి.గుర్రప్పను బి.కోడూరుకు, వల్లూరు ఎంపీపీలో ఉన్న వి.చంద్రకళను కడప జెడ్పీకి, కడప డీఎండబ్ల్యూఓ కార్యాలయంలో పని చేస్తున్న ఎస్‌.కరీముల్లాను చెన్నూరు ఎంపీపీకి, బద్వేలు ఎంపీపీలో పని చేస్తున్న ఓ.శారదమ్మను అక్కడే నియమించారు.

ఎర్రగుంట్ల ఎంపీపీలో పని చేస్తున్న పి.శేఖర్‌ను జమ్మలమడుగు, వేంపల్లె జెడ్పీ హైస్కూలులో పని చేస్తున్న బి.రఘునాథరెడ్డిని పులివెందులకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షులు బాలయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రమణారెడ్డి, ఏఓ రంగాచార్యులు, పంచాయతీరాజ్‌ మినిస్ట్రీరియల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు లంకా మల్లేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటిని వారు ఘనంగా సత్కరించారు.

Advertisement

What’s your opinion

Advertisement