యూరియా కొరత లేకుండా చూస్తాం
గోపవరం : ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు యూరియా కొరత లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ బి.చంద్రనాయక్ సోమవారం తెలిపారు. మండలంలోని బేతాయపల్లె, టీ.సండ్రపల్లె రైతుసేవా కేంద్రాలను ఏడీఏ వెంకటసుబ్బయ్యతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన 440 బస్తాలు యూరియా మండలానికి కేటాయించినట్లు, ఇప్పటి వరకు 150 బస్తాలు రైతులకు ఇచ్చామని..ఇంకా 290 బస్తాలు పంపిణీ కోసం సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అవసరానికి తగ్గట్టుగా యూరియాను తీసుకెళ్లి అధికారులకు సహకరించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వీలైనంత వరకు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని రైతులకు సూచించారు. పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ సిబ్బందిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ విజయరావు, ఏఈఓ ఓబయ్య, వీఏఏ సుప్రియ తదితరులు పాల్గొన్నారు.


