స్టాఫ్‌నర్స్‌గా పదోన్నతులు
కడప రూరల్ : కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం ఏఎన్‌ఎం నుంచి స్టాఫ్ నర్స్ గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. జోన్–4 రాయలసీమ జిల్లాల పరిధిలో మొత్తం నలుగురికి ప్రమోషన్ లు కల్పించారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామ గిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, ఉద్యోగుల సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దారుకు
షోకాజ్ నోటీసు
గోపవరం : రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన తహసీల్దారు త్రిభువన్‌రెడ్డికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి షోకాజ్ నోటీసు జారీ చేశారు. కాగా త్రిభువన్‌రెడ్డి తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెవెన్యూపరమైన సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వివాదాలకు కూడా కార్యాలయం నిలయంగా మారింది. సమస్యలు పరిష్కారం కాని పలువురు లబ్ధిదారులు జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో వినతులు కూడా సమర్పించారు. అయినా ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూ ఆక్రమణలకు కూడా అడ్డుకట్ట వేయకపోగా కబ్జాదారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ తహసీల్దారుకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఆయన పనితీరు చర్చనీయాంశంగా మారింది.
జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా
కడప సెవెన్‌రోడ్స్ : వైఎస్సార్ కడపజిల్లా జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓఆర్‌టీ నెం. 63ను సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుమునుపు తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. రాజస్థాన్‌కు చెందిన నిధి మీనా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హార్డింగ్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందారు. అనంతరం యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి 2019 బ్యాచ్‌లో ఐఏఎస్ అదికారిగా ఎంపికయ్యారు.
ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సభా భవన్‌లో వివిధ ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారానికి వచ్చిన అర్జీ దారుల నుంచి ఇన్‌చార్జి జేసీ విశ్వేశ్వరనాయుడు అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట పతి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అగస్త్యేశ్వరస్వామిని
దర్శించుకున్న జడ్జి
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని సోమవారం రాష్ట్ర ఉప లోకాయుక్త జడ్జి పగిడి రజని దర్శించుకున్నారు. అగస్త్యేశ్వరస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారికి జడ్జి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అగస్త్యేశ్వరస్వామి విశిష్టతను, ఆలయ ప్రత్యేకతను జడ్జికి వివరించి ప్రసాదం, ఆశీర్వచనాలు అందించారు. జడ్జిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ ఈఓ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దాసరి భానుప్రకాష్ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గ్రంథాలయాల పురోభివృద్ధికి కృషి చేస్తా నని తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి బీజేపీ అగ్ర నేతలకు, మంత్రి సత్యకుమార్‌కు, సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ శశిభూషణ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
స్టాఫ్‌నర్స్‌గా పదోన్నతులు
స్టాఫ్‌నర్స్‌గా పదోన్నతులు


