చుకు చుకు బండి.. పండక్కు లేదండి !
వారాంతపు రైళ్లు
● ప్రత్యేక రైళ్లకు మొండిచెయ్యి
● కడప, తిరుపతి జిల్లా లైనులో ప్రయాణం కష్టం
● నడుస్తున్న వారాంతపు రైళ్లు
31వ తేదీ వరకు పొడిగింపు
రాజంపేట : కడప, తిరుపతి జిల్లా రైలుమార్గంలో ప్రయాణం పట్టాలు తప్పింది. జిల్లాకు ఒక్కటంటే ఒక్కటి కూడా సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలు వేయలేదన్న విమర్శలను రైల్వేశాఖ మూటగట్టుకుంది. తమకు ఉపయోగకరంగా ఉంటుందనే పేద, మధ్య తరగతి ప్రయాణికుల ఆవేదన రైల్వేశాఖ పట్టించుకోలేదు. తెలంగాణ, కర్నాటకతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న వారికి రెగ్యులర్ ట్రైన్‌లో రావాలంటే ప్రయాణం కష్టతరంగా మారింది. సంక్రాంతి రైళ్లేవీ లేకపోవడంతో స్వంత ఊళ్లకు రావాలంటే తలప్రాణం తోకకు వచ్చేలా తయారైంది. సంక్రాంతి రైళ్లు అన్నీ సర్కారు ప్రాంతం వైపే పరుగులు తీశాయి. సీమ రైల్వేలపై నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. నడుస్తున్న వారంతపు రైళ్లను ఈనెల 31 వరకు పొడిగించారు. ఈ రైళ్లకు కడపస్టేషన్ హాల్టింగ్‌కే పరిమితం కావడం గమనార్హం.
బెర్త్ దొరకకపోయినా..
ఒక్కో బండిలో 500కు పైగా వెయింటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. రైళ్లలో ఆ పరిమితి కూడా దాటిపోయి రిగ్రెట్‌కు చేరింది. బెర్తు దొరక్కపోయినా వెయింటింగ్ లిస్ట్ టికెట్‌తో ఏదోలా ప్రయాణం చేద్దామనుకునే వారికి ఆ అవకాశం కూడా లేకుండా నిరీక్షణ తర్వాత చాంతడంత ఉంది.
60 రోజుల ముందు నుంచే..
సంక్రాంతి పండుగకు 60 రోజుల ముందు నుంచే ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నారు. ముందే రిజర్వేషన్లు ప్రారంభం కావడంతో.. వెంటనే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇక కొంతమంది అయితే ముందురోజు ఓపెన్ అయ్యే తత్కాల్‌లో అయినా టికెట్ దొరుకుతుందనే ఆశలో ఉన్నారు.
సంక్రాంతి రద్దీ
14, 15, 16 తేదీలలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో వారంరోజుల ముందునుంచే రైళ్లలో రద్దీ తీవ్రంగా ఉంది. హైదరాబాదు నుంచి ఉభయ వైఎస్సార్ జిల్లాలోని కడప, రాజంపేట, రైల్వేకోడూరు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కమలాపురం, నందలూరు తదితర ప్రాంతాలకు వేలాది మంది కుటుంబాలు సంక్రాంతి పండుగకు వచ్చేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది.
నలుగురున్న సభ్యులు సొంతూరికి..
నలుగురు సభ్యులున్న కుటుంబం సొంతూరికి వెళ్లిరా వాలంటే ఖర్చు ఎక్కువయ్యే స్థితి నెలకొంది. ఇక రైలు లో టికెట్లు దొరకని వారంతా బస్సు అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. రైల్వేశాఖ పండగ సీజన్ దృష్ట్యా ఏమైనా ప్రత్యేక రైళ్లు నడిపితే వాటిలో టికెట్లు బుక్ చేసుకుందామనే ఆశలు లేవు. ఎందుకంటే జిల్లా మీదుగా ప్రత్యేకరైళ్లు నడపడం లేదు.
డే ట్రైన్ రన్ చేయాలనే డిమాండ్
ఉభయ జిల్లాలమీదుగా అన్‌రిజర్వడ్ డే ట్రైన్‌ను తెలంగాణకు నడిపించాలనే డిమాండ్‌ను ప్రజాప్రతినిధులు రైల్వేబోర్టు దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరహాలో ఇప్పటికే తిరుపతి నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును విజయవాడ మీదుగా నడిపిస్తున్నారు. ఇదే విధంగా రెగ్యులర్‌గా జిల్లామీదుగా నడిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రయాణికులు అంటున్నారు. దీని వల్ల సంక్రాంతి రద్దీను తట్టుకునేందుకు వీలుంటుందని రైల్వేశాఖ ఆలోచించడం లేదన్న విమర్శలున్నాయి.
తేదీ రైలు నడిచే ప్రాంతం
నెంబరు
5 07787 కాచిగూడ – తిరుచానూరు
12 07017 చెర్లపలె–తిరుపతి
14 07718 హిసార్ జంక్షన్–తిరుపతి
15 07001 చెర్లపల్లె నుంచి తిరుపతి
23 07140 చెర్లపల్లె–తిరుపతి
చుకు చుకు బండి.. పండక్కు లేదండి !


