హమాలీలతో ముఖాముఖి
నల్లగొండ : దేశంలోనే రికార్డుస్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో లారీల కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం ధాన్యం సేకరణపై కలెక్టర్ ఛాంబర్‌లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో ధాన్యం సేకరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ లారీల సమస్యను అధిగమించేందుకు కలెక్టర్లు అన్ని రకాల వాహనాలను ధాన్యం సేకరణకు మళ్లించాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, ధాన్యం సేకరణలో భాగస్వాములైన అధికారులంతా రానున్న వారం, పది రోజులు పూర్తిస్థాయిలో దృష్టి పెడితే ధాన్యం సేకరణ ఇబ్బందులు లేకుండా సాగుతుందని అన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్, మిర్యాలగూడ ప్రాంతంలో సన్నధాన్యం ఎక్కువగా వస్తున్నందున అక్కడ ఎలాంటి సమస్యలు లేవని, నల్లగొండ, నకిరేకల్, దేవరకొండ, తుంగతుర్తిలోని కొన్ని ప్రాంతాల నుంచి ధాన్యం ఎక్కువగా వస్తున్నందున సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కువ లారీలు అవసరమైన సెంటర్లను గుర్తించి అక్కడికి లారీలు పంపించి త్వరగా ధాన్యాన్ని తీసుకువెళ్లే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు చంద్రశేఖర్, తేజస్ నంద్‌లాల్‌పవర్, అనురాగ్ జయంతి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏమన్నారంటే..
● ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం లారీలను వినియోగించాల్సిన అవసరం ఉందని, అలాగే ధాన్యం లారీలను ట్యాగింగ్ చేయాలని సూచించారు.
● తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యం లిఫ్ట్ చేసేందుకు లారీల సమస్య లేకుండా చూడాలన్నారు.
● ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.
● నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ లారీలు, హమాలీ సమస్య లేకుండా చూడాలన్నారు.
● ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ ధాన్యం సేకరణపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు.
● భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో పండిన ధాన్యాన్ని గత సంవత్సరం జనగామ జిల్లాకు పంపేందుకు అనుమతించారు, ఈ సారి కూడా అనుమతి ఇవ్వాలని కోరారు.
● దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ మా ప్రాంతంలో వచ్చే ధాన్యాన్ని ఉంచేందుకు మిల్లులలో స్థలం అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
● ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలును వేగంతం చేయాలన్నారు.
● మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్‌పోర్ట్ సమస్యను పరిష్కరించాలన్నారు.
ఫ కొనుగోళ్లలో ఇబ్బందులు కలిగించొద్దు
ఫ లారీ కాంట్రాక్టర్లు సతాయిస్తే సహించం
ఫ అధికారులంతా భాగస్వాములై కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలి
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫ కలెక్టరేట్‌లో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డితో కలిసి సమీక్ష
మంత్రులు ముందుగా నల్లగొండ సమీపంలోని ఓ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. మిల్లు యజమాని, హమాలీలతో ముఖాముఖి మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారని హమాలీలను ప్రశ్నించారు. వారు బిహార్ నుంచి వచ్చామని చెప్పాడంతో.. జిల్లాలో ధాన్యం ఎక్కువగా వస్తోందని.. ఇంకా బాగా కష్టపడి పనిచేసి సహకరించాలని కోరారు.


