ఆహార కల్తీపై ప్రత్యేక నిఘా పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఆహార కల్తీపై ప్రత్యేక నిఘా పెట్టాలి

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

సాక్షి, యాదాద్రి : ఆహార కల్తీపై ప్రత్యేక నిఘాపెట్టి కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం భువనగిరి కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జిల్లా ఆహార పరిరక్షణ నియమిత అధికారి పి.స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆహార నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో ఆహారాన్ని వండే సిబ్బందికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలని, వంట చేసే వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యార్థులకు సురక్షితమైన భోజనం అందుతుందన్నారు. అంగనన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసే గుడ్లు, ఇతర ముడి సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. జిల్లాలో ప్రధాన సమస్యగా మారిన పాల కల్తీపైనా దృష్టి సారించాలన్నారు. ఆహార భద్రత అధికారి పి.స్వాతి మాట్లాడుతూ జిల్లాలో కల్తీని అరికట్టేందుకు తమ బృందం నిరంతరం నిఘా ఉంచుతుందన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, భువనగిరి గ్రామీణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement