వలస కార్మికులపై.. పోలీసుల నిఘా | - | Sakshi
Sakshi News home page

వలస కార్మికులపై.. పోలీసుల నిఘా

May 15 2026 10:56 AM | Updated on May 15 2026 10:56 AM

యజమానులకు

పోలీసుల సూచనలు

పోలీస్‌ క్లియరెన్స్‌ తీసుకున్న తర్వాతే పనిలో పెట్టుకోవాలి

సాక్షి, యాదాద్రి : నేరాల నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఐపీఎస్‌ భార్య హత్య, జవహర్‌నగర్‌, కరీంనగర్‌ బ్యాంకుల్లో చోరీలు వంటి ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా వలస కార్మికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ అక్షాంష్‌ యాదవ్‌ ఆదేశాల మేరకు భువనగిరి పోలీసులు హోటళ్లు, రిసార్టులు, వివిధ వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. వారి వేలిద్రలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

అధునాతన సాంకేతికతతో నిఘా

నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. నేపాల్‌, బీహార్‌, ఒరిస్సా, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, యూపీ, రాజస్థాన్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన, పని చేస్తున్న కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. బుధవారం 30 మంది వివరాలను సేకరించారు. వలస కార్మికుల వేలిముద్రలను ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టంలో నిక్షిప్తం చేస్తున్నారు. దీనివల్ల గతంలో ఉన్న నేరచరిత్ర బయట పడుతుంది. భవిష్యత్‌లో సదరు వ్యక్తులు ఎక్కడైనా నేరాలకు పాల్పడితే, వారి వేలిముద్రల ఆధారంగా క్షణాల్లో గుర్తించే వీలుంటుంది. కార్మికుల స్థానికత, వారి బంధువుల వివరాలు, ఆధార్‌ నంబర్‌ వంటి వివరాలను సేకరించడంతో పాటు గుర్తింపు కార్డులను కూడా పోలీస్‌ రికార్డుల్లో భద్రపరుస్తున్నారు. గతంలో కూడా పట్టణ పోలీసులు వలస కార్మికుల వివరాలను సేకరించారు.

జిల్లాలో వేలాది మంది

భువనగిరి జిల్లా కేంద్రంతోపాటు పారిశ్రామికి వాడలు, కంపెనీలు, రైస్‌ మిల్లులు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ రంగం, హోటళ్లు, వ్యవసాయ పనులతో పాటు పలు రంగాల్లో వసల కార్మికులు వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. భువనిగిరి, చౌటుప్పల్‌, బీబీనగర్‌, పోచంపల్లి, బొమ్మలరామారం, ఆలేరు ఇలా దాదాపు అన్ని మండలాల్లో వలస కార్మికులు వివిధ పనుల్లో ఉన్నారు.

కొత్త వ్యక్తులను పనిలోకి తీసుకునే ముందు వారిని పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకువచ్చి నేర చరిత్ర తనిఖీ చేయించుకోవాలి.

పోలీసుల క్లియరెన్స్‌ పొందిన తర్వాతే వారిని విధుల్లోకి తీసుకోవడం సురక్షితం.

యజమానులు అశ్రద్ధ వహిస్తే, భవిష్యత్తులో జరగబోయే అనర్థాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయాలి. లేదా డయల్‌ 100కు సమాచారం అందించాలి.

ఫ నేరాల నియంత్రణకు చర్యలు

ఫ కార్మికుల వేలిముద్రలు ‘అఫిస్‌’లో నమోదు

ఫ పోలీసుల క్లియరెన్స్‌లేనిదే పనిలో పెట్టుకోవద్దు

ఫ యజమానులకు ఎస్పీ ఆదేశాలు

యజమానులు కొత్తవారిని పనిలో పెట్టుకునే ముందు పోలీస్‌ క్లియరెన్స్‌ తీసుకోవాలి. వివిధ రాష్ట్రాల నుంచి పనుల కోసం వస్తున్న వారిని ఎలాంటి విచారణ లేకుండా పనిలో పెట్టుకోవద్దు. ప్రధానంగా ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో అపరిచితులను, ఇతర ప్రాంతాల వారిని పనిలో పెట్టుకునే ముందు అప్రమత్తంగా ఉండాలి.

– ఎం.రమేష్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌, భువనగిరి

Advertisement
 
Advertisement
Advertisement