భువనగిరి : పట్టణంలోని కేంద్రియ విద్యాలయంలో 5, 7వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ చంద్రమౌళి బుధవారం ఒక ప్రకనలో తెలిపారు. 5వ తరగతిలో 3, 7వ తరగతిలో 3 సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల పిల్లలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 15 లోగా వెబ్‌సైట్ ద్వారా లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పాలిసెట్‌కు 94 శాతం హాజరు
భువనగిరి : పాలిసెట్–2026 పరీక్ష జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా జరిగింది. పరీక్ష నిర్వహణకు మొత్తం 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరిగింది. మొత్తం 1,692 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1594 మంది హాజరయ్యారు. 98 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో బాలురు 819, బాలికలు 775 మంది హాజరు కాగా 94.2 శాతం నమోదైంది.
సంస్కరణలతో సవాళ్లకు పరిష్కారాలు
నల్లగొండ టూటౌన్ : సంస్కరణలతో సవాళ్లకు పరిష్కారాలు లభిస్తాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. బుధవారం ఎంజీ యూనివర్సిటీలో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో నాణ్యత, నైపుణ్యం, పరిశోధన, సాంకేతికతల సమన్వయం ద్వారా మాత్రమే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. మారుతున్న కాలంలో భారతదేశానికి నిజమైన సంపద యువత అన్నారు. కార్యక్రమంలో వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఎన్జీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
రామగిరి(నల్గొండ): నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్ తెలిపారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా బుధవారం అడ్మిషన్ బ్యానర్, పోస్టర్‌ను అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. దోస్త్ –2026 ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో చేరవచ్చన్నారు. కళాశాలలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా డేటా సైన్స్, ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిజినెస్ అనలిటిక్స్ వంటి రీస్ట్రక్చర్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 14న సీట్ల కేటాయింపు ఉంటుందని, 15 నుంచి 23 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలన్నారు. వివరాలకు కోఆర్డినేటర్ (9989897566), టెక్నికల్ అసిస్టెంట్ 9985824737 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


