ఆలేరురూరల్ : రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ)కు నార్ముల్(మదర్ డెయిరీ) మధ్య జరిగిన ఒప్పందంతో పాడి రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక పాల శీతలీకరణ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్‌డీడీబీ ద్వారా మంజూరైన రూ.10 కోట్ల ఆర్థికసాయాన్ని చెక్కుల రూపంలో పాడి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పాల రైతులు ఆర్థికంగా బలపడాలంటే పాల ఉత్పత్తి రంగాన్ని ఆధునీకరించడం అత్యంత అవసరమన్నారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నార్ముల్(మదర్ డెయిరీ)కి మొత్తం 311 సొసైటీలు ఉన్నాయని, ఒకప్పుడు విస్తృతంగా పాల వ్యాపారం సాగించిన మదర్ డెయిరీ ఇటీవల భారీ నష్టాల్లో వెళ్లిందని అన్నారు. ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న లోన్లు పెరిగిపోవడంతో రైతులకు పాల బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మొత్తంగా రూ.70 కోట్లు అప్పుల్లో కూరుకుపోయి వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందన్నారు. బిల్లులు రాక రైతులు ప్రైవేట్ డెయిరీలకు మారిపోయారన్నారు. డెయిరీని గట్టెక్కించేందుకు మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు గుజరాత్ వెళ్లి ఎన్‌డీడీబీ చైర్మన్ మనీశ్ షా సహకారంతో ఒప్పందం జరిగిందన్నారు. దీంతో మదర్ డెయిరీ 15 సంవత్సరాలు ఎన్‌డీడీబీ ఆధీనంలో ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు, బ్యాంకు అప్పులు కలిపి రూ.70 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. రైతుల నుంచి పాల సేకరణ బాధ్యత మదర్ డెయిరీదే కాగా, ప్రొసెసింగ్‌తో పాటు పాల ఉత్పత్తుల నిర్వహణను ఎన్‌డీడీబీ ఆధ్వర్యంలోని ఢిల్లీ మదర్ డెయిరీ చూసుకుంటుందని తెలిపారు. సేకరించిన ప్రతి లీటర్ పాలకు మదర్ డెయిరీకి రూ.6.50 కమీషన్ ఇవ్వనుందన్నారు. ఈ నిధులతో పాల సేకరణ కేంద్రాల విస్తరణ, శీతలీకరణ కేంద్రాల ఆధునీకరణ, పాడి పరిశ్రమ విస్తరణ, పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్లు, పాల సంఘం చైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


