భూదాన్‌పోచంపల్లి : ప్రజల జీవనాన్ని దెబ్బతీస్తున్న కాలుష్య కారక కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త కుంభం పురుషోత్తంరెడ్డి కోరారు. భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో బుధవారం కంపెనీల కాలుష్యం నుంచి కాపాడాలని కోరుతూ అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని పురుషోత్తంరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ప్రజల ప్రాథమిక హక్కులను హరించే కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు గతంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులిచ్చిందని గుర్తుచేశారు. నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి ఆరోగ్య పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక హెజెలో కంపెనీ అత్యంత విషపూరితమైన పాస్‌జీన్ వాయువును గాలిలోకి విడుదల చేస్తుండం ఆందోళనకరమని అన్నారు. ఈ వాయువును పీల్చడం వల్ల క్రమంగా మనుషులు ప్రాణాలు కోల్పోతారని, గాలి, నీరు, నేలను కాలుష్యం చేస్తున్న కంపెనీలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు గుమ్మి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. రసాయన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు 32 సార్లు పిటిషన్ ఇచ్చామని, కానీ నేటికీ న్యాయం జరగలేదని అన్నారు. కంపెనీల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.52వేల పరిహారం చెల్లించాలని, గ్రామంలో గాలిలో ఉన్న కాలుష్యాన్ని నిర్ధారించే యంత్రాన్ని, ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని, తాగు, సాగునీటిని అందించాలని, రసాయన కంపెనీలను తరలించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్తలు ఇంద్రసేనారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, పాకనాటి దామోదర్‌రెడ్డి, గ్రామ పోరాట సమితి నాయకులు గుమ్మి నరేందర్‌రెడ్డి, వస్పరి ప్రభ, రావుల రాంరెడ్డి, రేణుక, గుర్రం రాంచంద్రారెడ్డి, రావుల శశికిరణ్, నర్సిరెడ్డి, బాల్‌రెడ్డి, మహేశ్, శివరాజు, రమేశ్, లింగమ్మ, జంగమ్మ, కలమ్మ, ధనలక్ష్మి, ముత్తమ్మ, సురేందర్‌రెడ్డి, పకీరు పాల్గొన్నారు.
ఫ పర్యావరణవేత్త కుంభం పురుషోత్తంరెడ్డి


