రామగిరి(నల్లగొండ) : ట్రాక్టర్ ఢీకొని రైతు మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగుపల్లి గ్రామానికి చెందిన బెలిదె శ్రీనివాస్(49) వ్యవసాయ పనులు ముగించుకుని స్కూటీపై ఇంటికి తిరిగి వెళ్తుండగా.. గ్రామంలోని సెంటర్ వద్ద నల్లగొండ వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదాబాబు తెలిపారు.
చికిత్స పొందుతూ..
పెన్‌పహాడ్ : అప్పుల బాధతో పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పెన్‌పహాడ్ మండలం చినసీతారాంతండాకు చెందిన బాణోతు దస్రు(45) మినీ బోర్‌వెల్ కొనుగోలు చేసి దానిని నడపటానికి అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక మనోవేదనకు గురై ఈ నెల 8న రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. విషయం భార్యకు చెప్పడంతో ఆమె వెంటనే దస్రును సూర్యాపేట ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు బాణోతు సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు.
హోటళ్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారి తనిఖీలు
నాంపల్లి : మండల కేంద్రంలోని పలు రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్. శివశంకర్‌రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 40 కిలోల కుళ్లిన మాంసం, 30 కిలోల పాడైన అన్నం, పెరుగు, అల్లం పేస్ట్, కృత్రిమ రంగులు, గడువు ముగిసిన మసాలాలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. అంతేకాకుండా కొన్ని హోటళ్లు ఫుడ్ లైసెన్స్ సర్టిఫికెట్ ప్రదర్శించడంలేదని గుర్తించారు. పలు ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. అనంతరం రోడ్డు పక్కన ఐదుగురు వ్యాపారులు విక్రయిస్తున్న మామిడి పండ్లను తనిఖీ చేశారు. కొందరు ఎన్‌రైప్, గోల్డ్‌రైప్ సాచెట్లను వినియోగించి మామిడి పండ్లను మగ్గబెడుతున్నట్లు గుర్తించారు.


