2803 మంది కార్మికులకు లబ్ధి! | - | Sakshi
Sakshi News home page

2803 మంది కార్మికులకు లబ్ధి!

Jan 17 2026 11:49 AM | Updated on Jan 17 2026 11:49 AM

2803

2803 మంది కార్మికులకు లబ్ధి!

త్వరలో కార్మికుల ఖాతాలలో జమ

భూదాన్‌పోచంపల్లి : చేనేత కార్మికులకు రుణమాఫీ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం ఊరటనిచ్చింది. కార్మికుల లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నవంబర్‌లో రూ. 33 కోట్లు మంజూరు చేయగా, తాజాగా రూ.16.27 కోట్లు విడుదల చేస్తూ ఉత్వర్తులు జారీ చేసింది. ఈ నెల 14న రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు నిధులను బ్యాంక్‌లకు పంపించి కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉమ్మడి జిల్లాలో 2803 మంది

2017 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి లోపు చేనేత కార్మికులు బ్యాంకులలో తీసుకొన్న లక్షలోపు వ్యక్తిగత రుణాలకు రుణమాఫీ వర్తిస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,803 మందికి రూ. 23.25 కోట్ల మేర రుణమాఫీ జరుగనుంది. ఇందులో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,380 మందికి రూ.19.25 కోట్లు మాఫీ కానుండగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు కలిపి 423 మందికి రూ.4 కోట్ల మేర రుణమాఫీ కానుంది.

రుణమాఫీలో జాప్యం

రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు కూడ రూ. లక్షలోపు రుణమాఫీ చేస్తామని 2024 సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌లోని జాతీయ సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవం సందర్బంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జీఓ నెంబర్‌ 56 జారీ చేసి 2025–26 బడ్జెట్‌లో రూ. 33 కోట్లు మంజూరు చేశారు. బ్యాంకుల వారీగా కార్మికులు తీసుకొన్న రుణాల జాబితాను అధికారులు రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించగా, సదరు కమిటీ ఆమోదించి ప్రభుత్వానికి నివేదించడంలో జాప్యం జరిగింది. దాంతో చేనేత రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ గత ఏడాది నవంబర్‌ 20న కార్మికులు హైద్రాబాద్‌లోని హ్యాండ్లూమ్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 25న రూ.33కోట్లు విడుదల చేసింది. కానీ గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రుణమాఫీ ప్రక్రియ ఆగిపోయింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా రూ.48 కోట్లకు పైగా రుణమాఫీ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేసింది. పూర్తిస్థాయి నిధులు విడుదల కాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దాంతో ఇటీవల చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ పోచంపల్లి, పుట్టపాకలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దాంతో ప్రభుత్వం మిగిలిన నిధులను సైతం విడుదల చేసింది.

చేనేత రుణమాఫీ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

ఫ గతంలో రూ.33 కోట్లు మంజూరు

ఫ తాజాగా రూ.16.27 కోట్లు విడుదల

ప్రభుత్వం రెండు రోజుల క్రితం రూ.16.27 కోట్లు విడుదల చేస్తూ జీఓ జారీ చేసింది. గతంలో రూ.9.62 కోట్లు రాగా, ప్రస్తుతం మంజూరైన నిధుల నుంచి జిల్లాకు 9 కోట్లు వస్తాయి. డబ్బులు రిలీజ్‌ కాగానే వారం, పది రోజుల్లో కార్మికుల ఖాతాలలో నేరుగా జమ చేస్తాం.

శ్రీనివాసరావు, చేనేత ఏడీ,

యాదాద్రి భువనగిరి జిల్లా

2803 మంది కార్మికులకు లబ్ధి!1
1/1

2803 మంది కార్మికులకు లబ్ధి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement