తాళం వేసిన ఇంట్లో చోరీ
మర్రిగూడ : మండలంలోని తిరగండ్లపల్లి గ్రామానికి చెందిన డేరంగుల శ్రీను ఇంట్లో గురువారం రాత్రి దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. శ్రీను ఈ నెల 15న ఇంటికి తాళం వేసి భార్య పిల్లలతో కలిసి సంక్రాంతి పండుగకు అత్తగారి ఇంటికి వెళ్లాడు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటితాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.50వేల నగదుతోపాటు ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం గమనించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, క్లూస్ టీంను రప్పించి0 ఆధారాలు సేకరించామని ఎస్‌ఐ మునగాల కృష్ణారెడ్డి తెలిపారు.
కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా
చివ్వెంల(సూర్యాపేట) : కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటన మండలంలోని బి.చందుపట్ల గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. సూర్యాపేట మండలం యర్కారం గ్రా మానికి చెందిన వెంకటేశ్ సంక్రాంతి పండుగకు మండలంలోని బి.చందుటప్ల గ్రామానికి ఆటోలో వచ్చాడు. డీజిల్ కోసం గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్దకు బయల్దేరాడు. మార్గ మధ్యంలో కుక్క అడ్డు రాగా దానిని తప్పించబోయి అదుపుతప్పిన ఆటో పల్టీ కొట్టింది. దాంతో వెంకటేశ్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి 108కు సమా చా రం అందించారు. అంబులెనస్ సిబ్బంది ఘట నా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.
వైరా నదిలో అనంతగిరి వాసి గల్లంతు
వైరారూరల్ : ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరంలో జాలిముడి ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న వైరా నదిలో వ్యక్తి ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అనంతగిరి గ్రామానికి చెందిన షేక్ నాగుల్ మీరా(32) సంక్రాంతి పండుగకు ఇటీవల కల్లూరు మండలం చిన్నకోరుకొండిలోని అత్తగారింటికి వెళ్లాడు. పండుగ శుక్రవారం ముగిశాక ద్విచక్ర వాహనంపై అనంతగిరి బయల్దేరాడు. మార్గమధ్యలో వైరా నదిపై గన్నవరం వద్ద లోలెవల్ వంతెనపై వాహనం అదుపు తప్పినట్లు తెలిసింది. దాంతో నాగుల్‌మీరా వైరా నదిలో పడి గల్లంతయ్యాడు. వైరా ఎస్‌ఐ పుష్పాల రామారావు ఘటనా స్థలానికి చేరుకుని వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా వివరాలు తెలుసుకుని నాగుల్‌మీరా కుటుంబానికి సమాచారం ఇచ్చారు. గల్లంతైన వ్యక్తి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
వండర్స్ ఆఫ్ తెలంగాణ
పోటీల్లో అవార్డు
దేవరకొండ : తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పోటీల్లో దేవరకొండ పట్టణానికి చెందిన యూనూస్ ఫర్హాన్ అవార్డు అందుకున్నారు. కై ట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో పట్టణానికి చెందిన పరిశోధకుడు ఫర్హాన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఫర్హాన్ మాట్లాడుతూ తన పరిశోధనలో భాగంగా దేవరకొండ ఖిలాకు సంబంధించి అద్భుతమైన ఫొటోలను ప్రదర్శించినందుకు తనకు అవార్డు లభించినట్లు తెలిపారు. పలు వురు యూనూస్ ఫర్హాన్‌ను అభినందించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ


