విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం
నల్లగొండ : విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తానని నమ్మించి నిరుద్యోగ యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుడిని చింతపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ జి. రమేష్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాటికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన ముప్పాల్ల లీలాకృష్ణ ప్రైవేటు ఉద్యోగి. విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతూ జిల్లాలోని పలువు నిరుద్యోగులకు ఆశ చూపి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. నల్లగొండ జిల్లా పోలేపల్లి రామ్‌నగర్‌కు చెందిన కోయిల్లకార్ కరుణాబాయి కొడుకునే కూడా ఇలాగే మోసం చేశాడు. దాంతో ఆమె ఇటీవల చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. లీలాకృష్ణ నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పలువురు నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడినట్లు తేలింది. గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసిన నిందితుడు.. స్వదేశానికి వచ్చిన తర్వాత వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో నిరుద్యోగ యువతను మోసం చేసినట్లు విచారణలో తేలినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. నిందితుడు ఇప్పటి వరకు 8 మంది నుంచి రూ. 85 లక్షలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మాల్ గ్రామం మర్రిగూడ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా చింతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. నిందితుడి నుంచి మూడు సెల్‌ఫోన్లు, ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడిపై మాడ్గులపల్లి, వరంగల్ పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదైనట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన నాంపల్లి సీఐ రాజు, చింతపల్లి ఎస్‌ఐ రామ్మూర్తి, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు పేర్కొన్నారు. చీఇలాంటి వారిపట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ సూచించారు.
ఫ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు


