దొంగతనం చేశాడని.. చెట్టుకు కట్టేసి చిత్రహింసలు
గుర్రంపోడు : డీజిల్ దొంగతనం చేశాడనే నెపంతో మైనింగ్ కంపెనీలో పనిచేస్తున్న బిహార్ కార్మికుడిని కంపెనీ ఇన్‌చార్జి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. దాంతో బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన అమిత్ కుమార్‌షా గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామ పరిధిలోని మైనింగ్ కంపెనీలో మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే డీజిల్ దొంగతనం చేశాడనే నెపంతో కంపెనీ ఇన్‌చార్జి తనను గ్రామ శివారుకు తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి మరో ఏడుగురితో కలిసి చిత్రహింసలకు గురిచేశారని, తన వద్ద నుంచి రూ.24 వేలను ఫోన్‌పే ద్వారా బలవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో
ఇల్లు దగ్ధం
చౌటుప్పల్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన మండలంలోని కుంట్లగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లెబోయిన శివశంకర్ చౌటుప్పల్‌లో టీస్టాల్‌లో పనిచేసేవాడు. ప్రస్తుతం సొంతంగా టీస్టాల్ పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అతడి భార్య లింగమణి గ్రామంలో చీరలు విక్రయిస్తుంది. శివశంకర్ సంక్రాంతి పండుగకు కప్రాయిపల్లిలోని తన అత్తగారి ఊరికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. శుక్రవారం అతడి ఇంట్లో నుంచి పొగలు వస్తుండడంతో గుర్తించిన స్థానికులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదు, అమ్మకానికి తెచ్చిన చీరలు, టీవీ, ఫ్రిజ్, వంట సామగ్రి, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. టీస్టాల్ పెట్టుకునేందుకు అప్పుతెచ్చి ఇంట్లో పెట్టిన నగదు, సామాన్లు పూర్తిగా కాలిపోయాయని, తమ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని శివశంకర్ దంపతులు బోరున విలపించారు.


