అమ్మా.. నాకు దిక్కెవరు | - | Sakshi
Sakshi News home page

అమ్మా.. నాకు దిక్కెవరు

Jan 12 2026 8:18 AM | Updated on Jan 12 2026 8:18 AM

అమ్మా.. నాకు దిక్కెవరు

అమ్మా.. నాకు దిక్కెవరు

ఖమ్మంక్రైం : చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లితోనే తన జీవితం, తల్లి వెంటే తాను అన్నట్టుగా గడిపాడు. తినడానికి తిండి, ఉండడానికి గూడు కూడా లేదు. దీంతో తన కొడుకు పస్తులుండకుండా ఆ తల్లి నిత్యం భిక్షాటన చేస్తూ బాలుడి కడుపు నింపేది. అయితే ఆ చిన్నారిపై విధి వక్రించింది. యాచనతో తన కడుపు నింపే తల్లిని కూడా దూరం చేసింది. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. కోదాడకు చెందిన మోతె లక్ష్మి( 40), లక్ష్మణ్‌ దంపతులు కూలి పని చేస్తూ జీవనం సాగించేవారు. ఐదేళ్ల క్రితం లక్ష్మణ్‌ అనారోగ్యంతో మృతిచెందడంతో కుమారుడు కిట్టూను పోషించేందుకు లక్ష్మి తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో కొడుకుతో సహా ఖమ్మం వచ్చి కూలి పనులు చేస్తూ కాలం గడుపుతుండగా ఆమె కూడా అనారోగ్యానికి గురైంది. దీంతో భిక్షాటన చేస్తూ కిట్టూను పోషించేది. కాగా, ఆమె పరిస్థితి విషమించి ఆదివారం ఖమ్మం రైల్వే స్టేషన్‌లో తనువు చాలించింది. ఈ విషయం తెలియని తొమ్మిదేళ్ల కిట్టూ తల్లిని ఎంత లేపినా లేవకపోవడంతో బిగ్గరగా రోదిస్తుండగా ప్రయాణికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అప్పటికే లక్ష్మి మృతిచెందింది. పక్కనే కూర్చుని రోదిస్తున్న కిట్టూను వివరాలు అడగగా తన పేరు, వివరాలు తెలిపాడు. తనకు ఒక మేనత్త ఉందని, ఆమె ఆచూకీ తెలియదని చెప్పాడు. దీంతో బాలుడిని చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులకు అప్పగించిన పోలీసులు బంధువుల ఆచూకీ కోసం కోదాడ పోలీసులను సంప్రదించారు. అన్నం ఫౌండేషన్‌ నిర్వాహకులు శ్రీనివాసరావు సాయంతో మృతదేహన్ని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు.

తల్లి మృతదేహం వద్ద బాలుడి రోదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement