శ్రీనృసింహుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం విశేష పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తీసిన అర్చకులు సుప్రఽభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు జరిపించి, అనంతరం గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు చేపట్టారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రికి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేశారు.
వడ్డె ఓబన్న జయంతి
భువనగిరిటౌన్ : తొలి వడ్డెర స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భువనగిరి కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలో ఓబన్న చిత్రపటానికి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సాహితి, జిల్లా అధికారులు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.
భూభారతి స్కాం విచారణ అధికారులుగా ఆర్డీఓలు
సాక్షి, యాదాద్రి : భూభారతి స్లాట్ బుకింగ్ స్కాంపై విచారణ చేపట్టినట్లు కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ అధికారులుగా భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు నియమించామని పేర్కొన్నారు. జిల్లాలోని పలు ఇంటర్ నెట్, మీసేవ కేంద్రాల్లో తక్కువ మొత్తం నగదును జమచేసిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు భూభారతి స్లాట్ బుకింగ్ స్కాంలో తేలిన బాధ్యుల నుంచి డబ్బులను రికవరీ చేయడమే కాకుండా పీడీ యాక్ట్, క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
18న సీపీఐ బహిరంగ సభ
చౌటుప్పల్ : సీపీఐ ఆవిర్భవించి వంద వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 18న నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బహిరంగ సభకు నలబై దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చనగోని గాలయ్య, పల్లె శేఖర్‌రెడ్డి, నాయకులు భాస్కర్, మోహన్‌రెడ్డి, రామలింగం, శంకర్, రాములు, సుధాకర్, మనోహర్ పాల్గొన్నారు.
వైభవంగా కూడారై ఉత్సవం
వలిగొండ : ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వలిగొండ మండలం వెంకటాపురంలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం కూడారై ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవి–రంగనాయక స్వామివార్లకు 108 గిన్నెలతో పాయసం నివేదనగావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్బాబు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
శ్రీనృసింహుడికి విశేష పూజలు
శ్రీనృసింహుడికి విశేష పూజలు


