చైనా మాంజాకు చెక్ పెట్టేలా..
భువనగిరిటౌన్ : జనవరి నెలలో ప్రధాన పండుగైన సంక్రాంతి వస్తుందంటే పిల్లలకు గుర్తుకు వచ్చేది గాలిపటాలు (పతంగులు)ఎగురవేయడమే. పిల్లలే కాదు పెద్దలు కూడా సంతోషంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పక్కనోడి గాలిపటాన్ని పడేయాలని తెగ ఆసక్తి చూపిస్తారు. అయితే గాలిపటాలను ఎగురవేసేందుకు సంప్రదాయ దారాన్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉన్నా అది బలంగా లేక తెగిపోతుందని కొందరు నిషేధిత చైనా మాంజాను వినియోగిస్తుంటారు. ఈ మాంజా మనుషులు, జంతువులు, పక్షులకు ముప్పు తెచ్చిపెడుతోంది. నిషేధిత చైనా మాంజాను కొందరు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా మాంజా వినియోగించొద్దని, మీ సరదా కోసం ఇతరుల ప్రాణాల మీదకు తేవొద్దని పోలీసులు అంటున్నారు. నిషేధిత చైనా మాంజా విక్రయాలు, వినియోగం వద్దని సోషల్ మీడియాలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. చాటుమాటుగా ఎవరైనా అమ్మితే తమకు సమచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా కొందరు వ్యాపారులు చైనా మాంజాను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే చైనా మాంజా విక్రయించకుండా, వాడకుండా దుకాణదారులు, వియోగదారులను కట్టడి చేస్తే ప్రమాదాలు జరగవని ప్రజలు అంటున్నారు.
ఫ సోషల్ మీడియా ద్వారా ముమ్మర ప్రచారం
ఫ గాలిపటాలు ఎగురవేసేందుకు సంప్రదాయ దారం వాడాలి
ఫ నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే సమాచారం ఇవ్వండి
ఫ పేర్లు గోప్యంగా ఉంచుతామంటున్న పోలీసులు


