‘జననీ’ ప్రోత్సాహకం పెండింగ్
నిధులు మంజూరు కాగానే జమచేస్తాం
మా పాపకు మూడు నెలల టీకా కూడా వేయించారు. గ్రామ ఏఎల్‌ఎం ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాను అందజేశాను. అయినప్పటికీ టీకా సంబంధించిన రూ.3 వేల ప్రోత్సాహకం అందాల్సి ఉంది. ఇంత వరకు డబ్బులు ఖాతాలో పడలేదు.
– పోలెపాక కవిత, పారుపల్లి
మా మనుమరాలును టీకా వేయించడం కోసం కూరెళ్ల సబ్ సెంటర్‌కు తీసుకొచ్చాను. పుట్టిన నుంచి ఇప్పటి వరకు 18 నెలల టీకా పూర్తయింది. పుట్టిన నుంచి ఇప్పటి వరకు రూ.7వేల వరకు జననీ సురక్ష ప్రోత్సాహకం నిధులు అందాల్సి ఉన్నా ఒక్క రూపాయ కూడా రాలేదు.
– వనం జనమ్మ, కూరెళ్ల
ఆత్మకూరు(ఎం) : గర్భిణులు, చిన్న పిల్లలకు జననీ సురక్ష యోజన పేరుతో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా ఆర్థిక ప్రయోజనం మాత్రం చేకూరడం లేదు. ఈ పథకంలో భాగంగా టీకాలు వేయించుకునే గర్భిణులకు, చిన్నారులకు ప్రోత్సాహకంగా అందించే ఆర్థికసాయం గత రెండేళ్ల నుంచి నిలిచిపోయింది. ఫలితంగా గర్భిణులు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తున్నారు.
పథకం అమలు ఇలా..
గర్భిణులు, అప్పుడే పుట్టిన పిల్లలు వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జననీ సురక్ష పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గర్భిణులకు, పిల్లలకు టీకాలను వేస్తుంటారు. ఈ క్రమంలో గర్భిణులు మూడు నెలలలోపు స్థానిక ఆరోగ్య కార్యకర్త వద్ద రిజిస్టర్ చేసుకున్నట్లయితే రూ.3 వేలు, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే రూ.4వేలు, ఆడపిల్లకు జన్మనిస్తే అదనంగా రూ.వెయ్యి గర్భిణుల ఖాతాలో జమ చేస్తారు. ఇక పుట్టిన పిల్లలకు మూడున్నర నెలల లోపు బీసీజీ టీకాలు పూర్తిగా వేయించినట్లయితే రూ.2వేలు, తొమ్మిది నెలలకు మిజిల్స్ టీకా వేయించినట్లయితే రూ.3వేలు, 18 నెలలకు బూస్టర్ టీకా వేయిస్తే రూ.2వేలు గర్భిణుల ఖాతాలో డబ్బులు జమవుతాయి. అయితే జననీ సురక్ష పథకం కింద లబ్ధి పొందడానికి ప్రతి గర్భిణి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాను ఆరోగ్య కార్యకర్తకు అందజేయాల్సి ఉంటుంది.
పేర్లు రిజిస్టర్ చేసుకున్నా..
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత 2023–24, 2024–25వరకు 15,314 గర్భిణులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 7,176 గర్భిణులు ప్రసవించారు. మూడున్నర నెలలలోపు పిల్లలు 20,491, పూర్తిగా టీకాలు వేయించుకున్న పిల్లలు 18,925 మంది పిల్లలు నమోదయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,176 గర్భిణులకు, 39,416 పిల్లలకు జననీ సురక్ష పథకం కింద రూ.15,34,78,000 అందాల్సి ఉన్నా.. ఇంత వరకు ఖాతాల్లో జమకాలేదు. ఇప్పటికై నా జననీ సురక్ష పథకం కింద అందాల్సిన డబ్బులను వెంటనే ఖాతాల్లో జమచేయాలని గర్భిణులు కోరుతున్నారు.
ఫ రెండేళ్ల నుంచి ఆర్థిక చేయూతనివ్వని జననీ సురక్ష పథకం
ఫ గర్భిణులు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలతోనే సరి
ఫ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రూ.15.34 కోట్లు
ఫ 46,592 మంది లబ్ధిదారుల ఎదురుచూపు
గర్భిణులు, పుట్టిన పిల్లలు వ్యాధుల బారిన పడకుండా వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నాం. టీకాలు వేయించుకునే వారిని ప్రోత్సహించేందుకు జననీ సురక్ష పథకం కింద ఆర్థికసాయం నిధులు అందిస్తున్నాం. అయితే టీకాలు పూర్తిచేసిన గర్భిణుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉంది. నిధులు విడుదల కాగానే జమచేస్తాం. – ఎం.మనోహర్,
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
‘జననీ’ ప్రోత్సాహకం పెండింగ్
‘జననీ’ ప్రోత్సాహకం పెండింగ్
‘జననీ’ ప్రోత్సాహకం పెండింగ్


