ఎన్నాళ్లీ ఎదురుచూపులు !
2024 ఏప్రిల్ –2025 అక్టోబర్ వరకు ఉద్యోగ విరమణ పొందినవారు
రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు ఇవీ..
ఆర్థిక ప్రయోజనాల కోసం రిటైర్డ్ ఉద్యోగుల నిరీక్షణ
కోదాడ: ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే డబ్బుతో ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న లోన్ ఈఎంఐల నుంచి విముక్తి పొందాలని కొందరు.. కుమార్తె వివాహం చేసి కుటుంబ బాధ్యతలు తీర్చుకోవాలని మరొకరు.. విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్లాలని మరికొందరు.. సొంతింటి నిర్మాణం చేయాలని ప్రణాళికలు వేసుకున్నవారు ఇంకొందరు.. వీరందరి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఆరు పదుల వయస్సులో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నాలుగు దశాబ్ధాలుగా వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వందల మంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 19 నెలలుగా ఎదురు చూస్తున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 763 మంది వివిధ స్థాయి ఉద్యోగులు 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ పొందారు. నెలకు సగటున 50 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం వివిధ స్ధాయిల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదనే వాపోతున్నారు.
19 నెలలుగా ఎదురుచూపులు
2021 మార్చిలో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. దీంతో అప్పటి నుంచి 2024 మార్చి వరకు ఉద్యోగుల ఉద్యోగ విరమణలు ఆగిపోయాయి. 2024 ఏప్రిల్ నుంచి తిరిగి ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి 2025 అక్టోబర్ వరకు 19 నెలల్లో ఉమ్మడి జిల్లాలో 763 మంది ఉద్యోగ విరమణ పొందారు. వీరికి సగటున ఒక్కొక్కరికి రు.40లక్షల చొప్పున రు.229 కోట్ల వరకు ఆర్ధిక ప్రయోజనాలు రావాల్సి ఉంది. వీటి కోసం రిటైర్డ్ ఉద్యోగులు వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికి ప్రభుత్వం వీరి ఆందోళనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ నెల 7న ఛలో హైదరాబాద్
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పటి వరకు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 7న ఛలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. అనేక సంవత్సరాలు పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ కార్యక్రమాన్ని పెన్షనర్స్ నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వీరు చూస్తున్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 17న మహాధర్నా నిర్వహిస్తామని కొందరు రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగులు అంటున్నారు.
జిల్లా ఉద్యోగ విరమణ
పొందినవారు
నల్లగొండ 310
సూర్యాపేట 234
యాదాద్రి భువనగిరి 219
మొత్తం 763
ఫ కమ్యుటేషన్ బకాయి – రూ.7లక్షల నుంచి రూ.10లక్షలు
ఫ ఈపీఎఫ్ – రూ.10లక్షల నుంచి రూ.12లక్షలు
ఫ గ్రాట్యుటీ – రూ.10లక్షల వరకు
ఫ ఫైనల్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ –
రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు
ఫ ప్రభుత్వ జీవిత బీమా – సుమారు రూ.5లక్షల వరకు
ఫ 19 నెలలుగా పట్టించుకోని ప్రభుత్వం
ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 763
మందికి అందాల్సిన ప్రయోజనాలు
ఫ ఒక్కొక్కరికి రూ.40 లక్షల వరకు బకాయిలు


