చికిత్స పొందుతూ మహిళ మృతి
హుజూర్‌నగర్: వేధింపులు తట్టుకోలేక ఉరేసుకున్న మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణా నికి చెందిన తవుడోజు అనూష(28)కు వేములపల్లి మండల కేంద్రానికి చెందిన దాసోజు జితేందర్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె సంతానం. వీరి కాపురం కొంతకాలం బాగానే కొనసాగింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అనూష తల్లి గతంలోనే చనిపోగా.. తండ్రి నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆమె సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో నివాసముంటున్న తన మేనమామ సొల్లేటి సోమాచారి వద్దకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో అనూషకు నర్సయ్యగూడేనికి చెందిన నన్నెపంగు మధుతో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా అనూష వేరే వ్యక్తితో మాట్లాడుతుండటంతో మధు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక ఆదివారం అద్దె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. మేనమామ సోమాచారి కుమార్తె చూసి తన తండ్రికి సమాచారం అందించడంతో అనూషను మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రాజాపేట: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. రాజా పేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన తరిగొప్పుల తిరుపతి(45)కి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. తిరుపతి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి చిన్న కుమార్తెకు పుట్టకతోనే అంగవైకల్యం ఉండడంతో ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో నెలకొన్న సమస్యల కారణంగా మనస్తాపానికి గురైన తిరుపతి సోమవారం గ్రామ శివారులోని తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గ్రామస్తులు గమనించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మంగళవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి


