అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్ట్
నల్లగొండ: అంతర్ రాష్ట్ర దొంగను మంగళవారం నల్ల గొండ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని శాంతినగర్‌లో నివాసముంటున్న జెర్రిపోతుల రవి ఇటీవల తన ఇంటికి తాళం వేసి ఊరికెళ్లి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వన్‌టౌన్ ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసి రవి ఇంటి పక్కన వ్యక్తి ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి అంతర్‌రాష్ట్ర దొంగ, పాత నేరస్తుడు రుద్రాక్షి శ్రీను చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. మంగళవారం మునుగోడు రోడ్డులో వన్‌టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రుద్రాక్షి శ్రీను బైక్‌పై అటుగా వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. అతడి నుంచి 6 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 40 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. రుద్రాక్షి శ్రీనును రిమాండ్‌కు తరలించామన్నారు.
త్రిపురారం: మహిళ మెడలో బంగారు గొలుసు అపహరించిన ఇద్దరిని త్రిపురారం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. హాలియా సీఐ సతీష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం నీలాయిగూడెం గ్రామానికి చెందిన ఉమ్మడి శకుంతలమ్మ గత నెల 27న మధ్యాహ్నం త్రిపురారం వైపు ఉన్న తన పొలం వద్దకు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి గ్రామానికి చెందిన కొండేటి చరణ్‌తేజ్, కుంచం వెంకటేష్ బైక్‌పై శకుంతలమ్మ వద్దకు వచ్చి త్రిపురారం ఎటువైపు వెళ్లాలంటూ అడిగారు. ఆమె అడ్రస్ చెబుతుండగానే మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపుకొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగిలించిన బంగారు గొలుసు విక్రయించేందుకు నిందితులు మంగళవారం ఆటోలో దేవరకొండ వైపు వెళ్తుండగా.. బాబుసాయిపేట రోడ్డు సర్కిల్ వద్ద త్రిపురారం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండటాన్ని గమనించి ఆటో దిగి పారిపోతుండగా వారిని పట్టుకుని విచారించారు. మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేసినట్లు నిందితులు నిజం ఒప్పుకున్నారు. నిందితులిద్దరిపై మిర్యాలగూడ రూరల్, వేములపల్లి, హైదరాబాద్‌లోని ఆర్‌సీపురం పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. వారి నుంచి 3 తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


