జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ
కేతేపల్లి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద మంగళవారం జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలిస్తున్నారని జిల్లా పోలీసులకు అందిన సమాచారం మేరకు నల్లగొండ, నకిరేకల్ డివిజన్‌లకు చెందిన దాదాపు 30 మంది పోలీసులు కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఎలాంటి మాదక ద్రవ్యాలు పట్టుబడలేదని తెలిసింది.
అప్పుల బాధతో ఆత్మహత్య
భువనగిరి: అప్పుల బాధ తట్టుకోలేక ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని పెద్ద చెరువులో చోటు చేసుకుంది. సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బల్కంపేటకు చెందిన బైరి జగన్(38) నిర్వహిస్తున్న ఫుడ్ బిజినెస్‌లో నష్టం రావడంతో పాటు అప్పులు పెరిగిపోవడంతో ఈ నెల 2వ తేదీ రాత్రి బీబీనగర్‌కు చేరుకొని వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన గల పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగన్ కనిపించకపోవడంతో అతడి భార్య పూర్ణిమ హైదరాబాద్‌లో బల్కంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. కాగా మంగళవారం ఉదయం పెద్ద చెరువులో వ్యక్తి మతృదేహం తేలియాడుతుండటం గమనించిన స్థానికులు బీబీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్ణిమ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలతో మృతదేహం ఆనవాళ్లు సరిపోలడంతో బీబీనగర్ పోలీసులు బల్కంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పూర్ణిమకు జగన్ మృతిచెందిన విషయం తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
కేతేపల్లి: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లికి చెందిన మారగోని బిక్షం(60) గేదెలను మేపేందుకు పక్కనే కొర్లపహాడ్ గ్రామ శివారులోకి వెళ్లాడు. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి వెంట గేదెలను మేపుతుండగా.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ భిక్షంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షం తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని నిలపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భిక్షం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ యు. సతీష్ తెలిపారు.
జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ


