మద్యం మత్తులో కత్తితో దాడి
త్రిపురారం: మద్యం మత్తులో ఓ వ్యక్తి కల్లు గీసే కత్తితో దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన త్రిపురారం మండలం కొణతాలపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోమటిగూడెం గ్రామానికి చెందిన నూకల ఉపేందర్‌రెడ్డి ట్రాక్టర్ షోరూంలకు జనరల్ మేనేజర్‌గా పనిచేస్తూ నల్లగొండలో నివాసముంటున్నారు. శనివారం సెలవు ఉండడంతో తన ఇద్దరు పిల్లలతో పాటు తనతో పనిచేసే రాము అనే వ్యక్తితో కలిసి కారులో కోమటిగూడేనికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం కొణతాలపల్లి శివారులో కల్లు అడ్డా వద్ద జక్కల సైదులు అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా పడుకోవడంతో కారు పోయేందుకు వీలేకాలేదు. ఉపేందర్‌రెడ్డి పక్కకు జరగమని అనడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న సైదులు అక్కడే ఉన్న కల్లు గీత కార్మికుడి వద్ద ఉన్న కత్తి తీసుకొని ఉపేందర్‌రెడ్డిపై దాడి చేశాడు. కారులో ఉన్న రాము వచ్చి అడ్డుపడగా అతడిపై కూడా దాడి చేశాడు. ఉపేందర్‌రెడ్డి పిల్లలు కారులోంచి కిందకు దిగడంతో స్థానికులు తిరిగి వారిని కారులో కూర్చోబెట్టారు. ఉపేందర్‌రెడ్డి, రాముకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందింతుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. క్షతగాత్రులు నల్లగొండలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉపేందర్‌రెడ్డిపై దాడి జరిగినట్లు తెలుసుకున్న కోమటిగూడెం వాసులు ఘటనా స్థలానికి చేరుకొని దాడి చేసిన వ్యక్తిని కొట్టడంతో అతడికి గాయాలైనట్లు తెలిసింది. ఈ ఘటనపై ఉపేందర్‌రెడ్డి భార్య కవిత త్రిపురారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.
ఇద్దరికి గాయాలు
పోలీసుల అదుపులో నిందితుడు
మద్యం మత్తులో కత్తితో దాడి


