ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యాశాఖలో ప్రభుత్వ విద్యా కార్యక్రమాల అమలు నుంచి పాఠశాలల సమన్వయం వరకు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న క్లస్టర్ రీసోర్స్ మొబైల్ (సీఆర్ఎం) టీచర్ల సేవలను గుర్తించి, వారిని టీచింగ్ స్టాఫ్గా పరిగణించి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని సీఆర్ఎం టీచర్లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 12 నుంచి 16 వరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాల నుంచి సుమారు 300 మందికి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపాధ్యాయుల మెడికల్ రీ–వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఏలూరు అర్బన్, రూరల్ పరిధిలోని సీఆర్ఎం టీచర్లు కీలక పాత్ర పోషించారు. షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడం, పరీక్షలకు హాజరయ్యేలా సమన్వయం చేయడం వంటి బాధ్యతలను వారు సమర్థవంతంగా నిర్వర్తించారు. మండల విద్యాశాఖ అధికారులు సబ్బితి నరసింహమూర్తి, సిలారపు హేబేలు, త్రిపుర సుందరీదేవి నోడల్ అధికారులుగా వ్యవహరించిన ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు సీఆర్ఎం టీచర్లు అందించిన సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో సుమారు 120 మంది సీఆర్ఎం టీచర్లు పనిచేస్తున్నారు. ఈ మెడికల్ రీ–వెరిఫికేషన్ ప్రక్రియలో లక్కపాము రాంబాబు, మెడపాటి స్పందన, పెనుమాక లీలావతి తదితరులు పాల్గొన్నారు.


