టి.నరసాపురం: మండలంలోని వెలగపాడు పంచాయతీ వీరభద్రవరం గ్రామంలో శుక్రవారం వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వీరభద్రవరం గ్రామానికి చెందిన కత్తి శేషుతో, సత్తాల గ్రామానికి చెందిన కత్తి శాంతి (26)కి 2018లో వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన శాంతి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణ పరిధిలో జరిగిన వేర్వేరు దొంగతనం కేసుల్లో ఇద్దరు నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ స్థానిక 1వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోవెన్నమఠం గ్రామానికి చెందిన రాజశేఖర్ గాంధీపై నమోదైన దొంగతనం నేరం రుజువు కావడంతో కోర్టు అతనికి 5 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన కృష్ణవంశీపై నమోదైన దొంగతనం కేసులో విచారణ అనంతరం 6 నెలల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించారు. పట్టణంలో నేర నియంత్రణకు సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి, నేరస్తులకు తగిన శిక్ష పడేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని టౌన్ పోలీసులు తెలిపారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి జడివాన కురిసింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు, సాయంత్రం వీచిన చల్లనిగాలులు, గంటపాటు కురిసిన చినుకులతో ఉపశమనం లభించింది. వర్షం కారణంగా ముందు జాగ్రత్త చర్యగా అధికారులు సాయంత్రం గంటకు పైగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని ఒక మెడికల్ షాపులో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ మెడికల్ డేటా పరిశీలనలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టామని తెలిపారు. గురువారం రాజమండ్రిలో తనిఖీలు చేశామని, క్రమంగా రోజుకో ప్రాంతంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. షాపులో ఎటువంటి అక్రమాలు లేదా అవకతవకలు చోటు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.


