నూజివీడు: పట్టణంలోని కుమార్ హైస్కూల్‌కు చెందిన ఎన్‌సీసీ జూనియర్ వింగ్ క్యాడెట్లు సీహెచ్ పోషక సాయి, ఆర్ అనూష ఆల్ ఇండియా స్థాయి క్యాంపునకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ పిన్నమనేని వెంకట కుమార్ శనివారం తెలిపారు. వీరు మధ్యప్రదేశ్‌లోని గ్వాలీయర్‌లో నిర్వహించే రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొంటారన్నారు. శిక్షణా శిబిరం ఈనెల 28 నుంచి అక్టోబర్ 10 వరకు జరుగనుందన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌తో పాటు కరస్పాండెంట్ పిన్నమనేని సంధ్యాలక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు.
కాళ్ల: కాళ్ళకూరు గ్రామంలో వేంచేసియున్న స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు గత నాలుగు రోజులుగా వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు భాద్రపద పౌర్ణమి శనివారం స్వామివారికి సప్త నదుల జలాలతో జలాభిషేకం నిర్వహించారు. ముందుగా సప్త నదులైన గోదావరి, సరస్వతి, యమునా, గంగా, కృష్ణ, కావేరి, నర్మద నదుల నుంచి తీసుకొచ్చిన జలాలతో గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర శత కలశార్చన, సప్త నదీ జలాభిషేకం, శాంతి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి మోకా అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక గోదావరి కాలువలో దూకి అదృశ్యమైన యువతి మృతదేహాన్ని శనివారం సాయంత్రం అగ్నిమాపక శాఖ సిబ్బంది వెలికితీశారు. ఈ ఘటనకు సంబంధించి ఫైర్ ఆఫీసర్ మురళి కొండబాబు శనివారం సాయంత్రం వివరాలు వెల్లడించారు. పట్టణంలోని 25వ వార్డు యాగర్లపల్లికి చెందిన ఎం. నాగమణి (23) ఏలూరు కాలువలో దూకినట్లు అనుమానంగా ఉందని, ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో తమకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే వాటర్ టెండర్ వాహనం, రెస్క్యూ బోటుతో ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, రోజంతా వెతికినా ఆచూకీ లభించకపోవడం, చీకటి పడటంతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం ఉదయం నుంచి రెస్క్యూ బోటు సహాయంతో తిరిగి గాలింపు చర్యలు పునరుద్ధరించారు. సాయంత్రం కూరెల్లగూడెం గ్రామం వద్ద నాగమణి మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఫైర్ ఆఫీసర్ వివరించారు.
భీమవరం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి రామరాజు శనివారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ధర్మవరంలోని స్వగృహంలో కన్నుమూశారు. మురళీకృష్ణంరాజును మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. రామరాజు మృతికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకుని, తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజుతోపాటు పలువురు నాయకులు మురళీకృష్ణంరాజును నేరుగా కలిసి పరామర్శించారు.


