ఏలూరు టౌన్: పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ (ఎస్‌సీటీపీసీ) పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. మొత్తం 136 మంది పోలీస్ కానిస్టేబుళ్లుగా శిక్షణ పొందారు. ఈ ప్రత్యేక పాసింగ్ అవుట్ పరేడ్‌కు రాష్ట్ర గృహ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్ రెడ్డి పాసింగ్ అవుట్ పరేడ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ శిక్షణ అందించిన బృందానికి, అలాగే శిక్షణలో క్రమశిక్షణ, క్రీడలు, ప్రతిభ కనబరిచిన ఉత్తమ క్యాడెట్లకు జ్ఞాపికలు అందజేశారు.
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
రాష్ట్ర మంత్రి పార్థసారథి మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో నూతనంగా పోలీస్ కానిస్టేబుళ్లుగా బాధ్యతలు చేపట్టిన వారు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ పోలీస్ విధుల్లో అంకితభావం, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజల పట్ల బాధ్యతాయుత వైఖరి ఎంతో ప్రాముఖ్యమైనవని సూచించారు. ఏలూరు జిల్లా పెదవేగి పీటీసీలో మంచి శిక్షణ అందించినందుకు ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ను ఆయన అభినందించారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సుదీర్ఘమైన కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజారక్షణ విధుల్లోకి అడుగు పెడుతున్న కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వై.ప్రసాద్‌రావు, ఏఆర్ అదనపు ఎస్పీ జీ.మునిరాజా, మాజీ ఎమ్మెల్యే మురళీరామకృష్ణ, ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్, పెదవేగి పోలీస్ ట్రైనింగ్ అధికారులు, శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


