న్యూస్‌రీల్
రహదారి ప్రమాదాలు నివారించాలి
జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ అధికారులను ఆదేశించారు. 8లో u
రెవెన్యూ క్లినిక్‌లతో భూ సమస్యల పరిష్కారం
● భీమవరంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆందోళన
● భారీ ప్రదర్శన, ప్రకాశం చౌక్ సెంటర్‌లో ధర్నా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మిషన్ సక్షం అంగన్‌వాడీ’ పథకం క్షేత్రస్థాయిలో తూతూమంత్రంగా మారుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 8లో u
బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026
పోలవరం రూరల్: గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం 1.56 లక్షల క్యూసెక్కల నీరు స్పిల్‌వే నుంచి దిగువకు చేరగా, రాత్రికి ఆ ప్రవాహం 1.16 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి నదిలోకి చేరే ఉప నదుల ప్రవాహం క్రమేపీ తగ్గుతుండటంతో వరద ఉధృతి కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం స్పిల్‌వే వద్ద నీటిమట్టం 28 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే లోని 48 గేట్ల ద్వారా 1.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడంలోనూ, జీవో నెం.77 రద్దులోనూ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐ.రాజేష్ మాట్లాడుతూ.. ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి కేవలం రూ. 13 వేలు మాత్రమే జమ చేయడం తల్లిదండ్రులను మోసం చేయడమేనని అన్నారు. అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు కాకి నాని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు విద్యాశాఖ ఏడీ–1కి వినతిపత్రం అందజేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లాలో ఎల్‌నినో ప్రభావం, సాగునీటి లభ్యతపై రైతులకు అవగాహన కల్పించినట్లు కలెక్టర్ కే వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీ సాయిప్రసాద్‌కి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం తగ్గుదల, సాగునీటి లభ్యత, 22ఏ దరఖాస్తుల పరిష్కారం, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రీ సర్వే, ఐవీఆర్‌ఎస్ సర్వే, రెవెన్యూ సమస్యల పరిష్కారం, తదితర అంశాలపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ జీ. జయలక్ష్మితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఎల్‌నినో కారణంగా సాగునీటి లభ్యతలపై రైతులకు అవగాహన కలిగించి, ఆరుతడి పంటలవైపు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్‌ఓ ఎం.శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బీ వినూత్న, ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, రమణ పాల్గొన్నారు.
భీమవరం: మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చాలని, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భీమవరంలో మంగళవారం భారీ నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరిట ఉద్యోగ నియామకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు నిర్వహించారు. ఉండి రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ బొంబే స్వీట్స్ సెంటర్, అంబేడ్కర్ సెంటర్ మీదుగా ప్రకాశం చౌక్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ నాయకులు, నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి.. పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పోస్టుల విక్రయంపై బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చి అమలుచేయని హామీలను ప్లకార్డుల ద్వారా ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు అరిగెల అభిషేక్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆందోళనలో వైఎస్సార్‌సీపీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పార్టీ మహిళావిభాగం రాష్ట్ర కార్యదర్శి పాలవెల్లి మంగ, విద్యార్ధి విభాగం రాష్ట్ర కార్యదర్శి గంటా రాహుల్, గుంటి ప్రభు, చినమిల్లి చందు, డి.ప్రకాష్, మానుకొండ శ్రీను, సునీల్‌వర్మ, ఐనపర్తి రాహుల్, షేక్ ఆలీ, బేతాల సంతోష్, వర్ధినీడి శ్రీనివాస్, వీరవల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి. మెగా డీఎస్సీ–2025 పేరుతో నిర్వహించిన దగా డీఎస్సీకి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. స్పోర్ట్స్ కోటా భర్తీ సహా పలు అంశాల్లో అభ్యర్థులకు అనుమానాలు ఉన్నాయి. లోకేష్‌కు మంత్రిగా కొనసాగే అర్హత లేదు.
– ముదునూరి మురళీకృష్ణంరాజు, వైఎస్సార్‌సీపీ నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు
నీట్ పేపర్ లీకేజికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్లే డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత ఉంటే సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ర్యాంకులు సాధించిన వారి పేర్లు సైతం రెండో దఫా మెరిట్ లిస్టులో తొలగించారు.
– చినమిల్లి వెంకటరాయుడు,
భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త
డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ఇంతటితో ఆగదు. డీఎస్సీలో అవినీతి, అక్రమాలు నిగ్గుతేల్చే వరకూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బాధితులకు అండగా ఉంటూ ఆందోళనలు చేపడతాం. తక్షణం ప్రభుత్వం స్పందించి డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి.
– పాలవెల్లి మంగ,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి
మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను మోసం చేసిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలి. అక్రమాలు జరిగిన మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. విచారణ పారదర్శకంగా సాగాలంటే మంత్రి రాజీనామా చేయాలి. ప్రభుత్వం దీనిపై తక్షణం చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.
– చిగురుపాటి సందీప్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు
చంద్రబాబు ప్రజలను ఎల్లప్పుడూ మోసం చేస్తూనే అధికారంలోకి వస్తున్నారు. గతంలో ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. మళ్లీ 2024 ఎన్నికల్లో నెలకు రూ. 3 వేలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్కొక్క నిరుద్యోగికి దాదాపు రూ.75 వేలు బాకీ పడ్డారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు.
– అరిగెల అభిషేక్,
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. ఎన్నికల్లో యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీవ్రంగా మోసం చేస్తున్నారు. మెగా డీఎస్సీ అంటూ గొప్ప ప్రచారం చేసుకుని అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడి దగా డీఎస్సీగా మార్చారు. డీఎస్సీపై విచారణ చేసి దగాపడ్డ నిరుద్యోగులకు న్యాయం చేయకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తాం.
– ద్వారంపూడి ప్రేమ్‌కిరణ్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి
నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లుగానే, డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి. డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటూ ఆందోళనలు కొనసాగిస్తుంది. డీఎస్సీ స్కామ్‌పై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలి.
– వర్ధినీడి విజయశ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ
పాలకొల్లు మండల యువజన విభాగం అధ్యక్షుడు
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): మద్ది ఆంజనేయస్వామివారిని మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు చేయించుకోవడంతో పాటు, పలువురు భక్తులు అన్నప్రాశనలు, వాహన పూజలు నిర్వహించుకున్నారు. వివిధ సేవల రూపంలో ఆలయానికి రూ.2,91,560 ఆదాయం సమకూరిందని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, సహాయ కమిషనర్, ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. అలాగే 2,172 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేసినట్లు వారు పేర్కొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): రెవెన్యూ క్లినిక్‌లతో భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌తో పాటు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటివరకు చేపట్టిన 27 రెవెన్యూ క్లినిక్‌లలో అందిన 1016 దరఖాస్తులకుగాను 401 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. 385 దరఖాస్తులు వివిధ దశల్లో పరిష్కార ప్రక్రియలో ఉన్నాయని, 230 దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించారు.
రీ–సర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి
జిల్లాలో భూ రీ–సర్వే ప్రక్రియను నిర్ధేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలకు పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మంగళవారం జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీతో కలిసి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రీ–సర్వే పనులపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలన్నారు.


